
- గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు: రాయలసీమ డీఎన్ఏ ఉన్న షర్మిల తెలంగాణ ఆడబిడ్డ ఎట్లా అవుతారని మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. శనివారం నల్గొండలో ఎమ్మెల్యే భాస్కర్రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వనరులు దోచుకోవాలనే కుట్రతోనే బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ అధ్యక్షులు పాదయాత్రల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేక, ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. షర్మిల పాదయాత్ర ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదని, కుటుంబపాలన అంటూ ఆమె ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుజూరాబాద్ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. బీజేపీ కేంద్రంలోని ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని కుటిల ప్రయత్నాలు చేస్తోందని, చివరకు ఘర్షణలు ప్రేరేపించేలా ప్రయత్నిస్తోందన్నారు. సౌమ్యుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. పెరిగిన డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాకే బీజేపీ ఓట్లు అడగాలని, అప్పటివరకు ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నా రు.