V6 News

డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం  : గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి

డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం  : గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి
  • శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి

నల్గొండ, వెలుగు : జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌‌‌‌ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శాసనమండలి చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌‌‌‌లో జనాభానే ప్రామాణికంగా తీసుకోకుండా 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్‌‌‌‌, డీలిమిటేషన్‌‌‌‌ బిల్లును వేర్వేరుగా ప్రవేశపెట్టాలని సూచించారు. జమిలి ఎన్నికలు అమలైతే దేశంలోని 18 రాష్ట్రాలకు ఒక విడతలో, మిగిలిన రాష్ట్రాలకు మరో విడతలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

రాజకీయాల్లో పెరిగిపోతున్న డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేయకపోతే, భవిష్యత్‌‌‌‌లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను బీఆర్ఎస్‌‌‌‌గా ఎందుకు మార్చారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అధికార పార్టీలో అసంతృప్తి ఉండటం సహజమేనన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్య ప్రస్తుతం పరిష్కారమైందని, ముఖ్యంగా సన్నధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ సేకరణపై ప్రభుత్వం పూర్తి స్థాయి నియంత్రణ కలిగి ఉండాలన్నారు. కేంద్రం 80 శాతం రా రైస్ అడుగుతుంటే.. మిల్లర్లు మాత్రం బాయిల్డ్ రైస్‌‌‌‌కే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

నల్గొండ జిల్లాకు కీలకమైన ఏఎమ్మార్పీ ద్వారా ప్రస్తుతం కేవలం 2,400 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని, దానిని నాలుగు వేల క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి కాల్వలను విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, లైనింగ్ పనులు చేపట్టకముందే కాలువల విస్తరణ పనులు పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత హామీలతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 20 లక్షల మంది ఇతర రాష్ట్రాల కూలీలు ఉపాధి పొందుతున్నారన్నారు.