
- గువ్వల బాల రాజు కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే విధంగా అధికారాన దుర్వినియోగం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, రాజకీయ స్వప్రయోజనాల కోసం పనిచేయటం సిగ్గుచేటని తెలిపారు.బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ, జార్జ్ సోరస్, శ్యామ్ పిట్రోడా కలిసి భారత రాజకీయాలను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేస్తున్నారని చెప్పారు.
ఎన్ని యాత్రలు చేసినా రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని ఆయన తేల్చి చెప్పారు.రాహుల్ గాంధీ అసలు రాజ్యాంగాన్ని చదువలేదని ఎద్దేవా చేశారు. బీసీ హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. ఎంత రెచ్చగొట్టినా జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు. తాను పదవుల కోసం బీజేపీలోకి రాలేదని గువ్వల పేర్కొన్నారు.