తెలంగాణలో అక్కడక్కడా వానలు దంచికొడుతున్నాయి. ప్రకృతి ప్రకోపం అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం (2026 ఏప్రిల్ 05) తెల్లవారుజామున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షం పడింది.
వేములవాడ పట్టణంలో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఉల్లెందుల రఘుపతి అనే రైతుకు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. వాటి విలువ దాదాపు లక్ష 50 వేల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు రఘుపతి విజ్ఞప్తి చేశాడు.
అటు కోనరావుపేట మండలంలో ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపు ఉన్న చెట్లు నెలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబి సహాయంతో చెట్లను గ్రామస్తులు తొలగించారు.
