ఇజ్రాయెల్ - హమాస్ వార్ : ఇద్దరు అమెరికన్ల విడుదల..

ఇజ్రాయెల్ - హమాస్ వార్ : ఇద్దరు అమెరికన్ల విడుదల..

ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్​ మధ్య భీకర యుద్ధ కొనసాగుతోంది. ఎప్పుడు.. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గాజాలో తమ చెరలో బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను(USA) విడుదల చేసినట్లు మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ (Hamas) ప్రకటించింది. ఖాతార్‌ దేశం సంప్రదింపుల నేపథ్యంలో మానవతా కోణంలో భాగంగా అమెరికాకు చెందిన తల్లీ కూతుళ్లను ‘అల్‌ ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌’ విడుదల చేసినట్లు టెలిగ్రామ్‌లో పోస్టు చేసింది. 

గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం (అక్టోబర్​ 20న) విడుదల చేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు చెప్పారు. విడుదలైన ఇద్దరు మహిళలు శుక్రవారం ఆలస్యంగా తమ దేశానికి చేరుకున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. 

మానవతా కోణంలో భాగంగా ఆమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను విడుదల చేశారు. భవిష్యత్‌లో మరింత మందిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలైన తల్లీకూతుళ్లను గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ కు చెందిన రాయబారి ఒకరు కలుసుకున్నారు. వారిని సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరానికి తరలించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ -గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ కిబ్బట్జ్ నుంచి అమెరికన్ తల్లి, కుమార్తెను హమాస్ సైన్యం బందీలుగా తీసుకెళ్లింది. ఆ సమయంలో వారు ఇజ్రాయెల్‌లో సెలవులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇద్దరు అమెరికన్లను విడుదల చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. విడుదలైన ఇద్దరు మహిళలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

Also Read :- గగన్‌యాన్‌.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై మెరుపుదాడి చేసిన హమాస్‌ గ్రూప్‌ సుమారు 200 మంది ఇజ్రాయెల్‌తో పాటు ఇతర దేశాల పౌరులను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఇజ్రాయెల్‌ గాజాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి హమాస్‌ను అంతం చేసే దిశగా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది మిలిటెంట్‌ గ్రూప్‌ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి గాజా భూభాగంలో గ్రౌండ్‌ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. 

గాజాలో హమాస్‌ బందీలుగా ఉన్న పౌరుల్లో చాలా మంది వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం (అక్టోబర్​20న) చెప్పింది. హమాస్‌ మిలిటెంట్లు దాడికి దిగిన సమయంలో మరణించిన వారి మృతదేహాలను సైతం మిలిటెంట్‌ గ్రూప్‌ గాజా స్ట్రిప్‌కు తరలించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. హమాస్‌ బందీల్లో 20 మందికిపైగా మైనర్లు, 10 నుంచి 20 మంది 60 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులు ఉన్నారని వివరించింది. హమాస్‌ దాడిలో 1400 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోగా, ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 4 వేలకు పైగా పాలస్తీనా పౌరులు మృతి చెందారు.