- హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెదకొడెపాకలో ఘటన
- అర్ధరాత్రి గోడ దూకి బయటకు వెళ్లిన బాలికలు
- పక్కనే ఉన్న పొలాల్లో తల దాచుకున్న స్టూడెంట్లను గుర్తించిన పోలీసులు
- పేరెంట్స్ కు అప్పగించిన సిబ్బంది
శాయంపేట, వెలుగు: హాస్టల్ చదువులు ఇష్టం లేక హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట శివారులోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు పరారయ్యారు. స్టూడెంట్స్ హాస్టల్ పరిసర ప్రాంతంలోనే దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేజీబీవీలోని ముగ్గురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పండ్ల ట్రే బాక్సులపైకి ఎక్కి గోడ దూకి పారిపోయారు.
తెల్లవారుజామున 4 గంటలకు నైట్ వాచ్ ఉమెన్ పర్వీద గమనించి, నైట్ డ్యూటీలో ఉన్న మాథ్స్ టీచర్ శ్రావణికి తెలియజేశారు. ఆమె హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ మాధవికి సమాచారం అందించారు. ఎస్వో వెంటనే పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గురుకులం చేరుకున్న పోలీసులు, తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గోవిందాపూర్ వెళ్లే దారిలో చెట్ల పొదల్లో దాక్కొని ఉన్న ముగ్గురు స్టూడెంట్స్ కనిపించారు.
టీచర్, స్పెషల్ ఆఫీసర్ మాధవిపై పిల్లల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో పిల్లలకు భద్రత లేదని, టీచర్లు డ్యూటీలో ఉండగా ఎలా పారిపోయారని నిలదీశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆర్.ప్రవీణ్ కుమార్ స్కూల్కు చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్లో ఉండడం ఇష్టం లేదని, ఆలస్యంగా లేస్తే గుంజీలు తీయిస్తున్నారని, గోడ కుర్చీ వేయిస్తున్నారని పిల్లలు స్టేట్మెంట్ ఇచ్చారు.
