
టాలీవుడ్ లో ఉన్న యాక్షన్ హీరోలల్లో ఒకరైన గోపిచంద్.. మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకొని కెరీర్లో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తూన్నాడు. మంచి నటనతో పాటు.. ఆరడుగుల యాక్షన్ కటౌట్ తో మాచో స్టార్ గా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్. అలాంటి నటుడు గోపీచంద్ బర్త్ డే (జూన్ 12) సందర్భంగా స్పెషల్ స్టోరీ.
గోపిచంద్ 12 జూన్ 1979లో ప్రకాశం జిల్లాలోని కాకతూరివారి పాలెంలో జన్మించాడు. సీనియర్ డైరెక్టర్ టి.కృష్ణ కొడుకు వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయైన గోపి చంద్.. మద్రాస్ లో పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపీ.. పై చదువులకోసం రష్యా వెళ్ళాడు. ఆ తర్వాత సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఫస్ట్ సినిమాగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో తొలివలపు అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా పెద్ద గా ఆడకపోవడంతో హీరోగా అవకాశాలు రాలేదు.
కొన్నాళ్ల తర్వాత విలన్ గా అవకాశం వచ్చింది గోపిచంద్ కి. కానీ హీరోగా చేసిన తర్వాత విలన్ గా అంటే ఎవ్వరికీ పెద్దగా ఇష్టం ఉండదు.కానీ గోపి తనలోని నటుడిని నిరూపించుకోవాలనే తపనతో ‘‘జయం’’ మూవీ చేశాడు. ఆ తర్వాత నిజం, వర్షం సినిమాల్లో కూడా పవర్ ఫుల్ విలన్ రోల్స్ చేసి అందరినీ మెప్పించాడు. మూడు సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తెచ్చాయి.జయం సినిమా కు బెస్ట్ విలన్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న గోపీచంద్... నిజం, వర్షం సినిమాలకు కూడా బెస్ట్ విలన్ గా మా టీవీ అవార్డ్స్ అందుకున్నాడు.ఆ తర్వాత మళ్లీ హీరోగా ‘‘యజ్ణం’’ చేసి హిట్ కొట్టాడు. అప్పటివరకు విలన్ గా చేసినా, ఒకే సినిమాతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా గోపిచంద్ ను హీరోగా నిలబెట్టింది.
యజ్ఞం తర్వాత గోపిచంద్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రుడు అంతగా విజయాన్ని అందుకోకపోయినా.. రణం మాత్రం సూపర్ హిట్ అయ్యింది. తనకంటూ స్పెషల్ మ్యానరిజంతో, లుక్స్ తో అభిమానులను ఏర్పరుచుకున్న గోపిచంద్. ఆ తర్వాత ‘‘రారాజు’’అనే మూవీ ఫ్లాప్ అయింది. అయితే వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తో ‘‘ఒక్కడున్నాడు’’అనే డిఫరెంట్ సబ్జెక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోయినా.. కొత్త ప్రయత్నం చేశారని ప్రశంసలు దక్కాయి.
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న గోపిచంద్ ఈ సారి రూట్ మార్చాడు. అప్పుడప్పుడే ఫేడవుట్ అవుతన్న జగపతిబాబుతో "లక్ష్యం" అనే మల్టీ స్టారర్ చేశాడు. శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఇక్కడే తనకు సున్నా సెంటిమెంట్ వర్కవుట్ అయిందని నమ్మాడు. ముందు నుంచి టైటిల్ లో సున్నా ఉండటం వల్ల ఆ చట్రంలో ఇరుక్కుపోయాడు. అందుకే తర్వాత ప్రతీ సినిమాలో సున్నా ఉండేలా చూసుకున్నాడు. కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. వరుసగా ఒంటరి, శౌర్యం, శంఖం ఫ్లాప్ అయ్యాయి. ఈ దెబ్బతో కాస్త జాగ్రత్త వహించిన గోపిచంద్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ‘‘గోలీమార్’’ అనే యాక్షన్ సినిమా సెట్ చేశాడు. ఈ సారి ఓ మోస్తారు సక్సెస్ కొట్టాడు. పూరీ రాసిన పవర్ ఫుల్ డైలాగులు గోపిచంద్ కూడా అంతే పవర్ ఫుల్ గా చెప్పడంతో జనాలు కనెక్టయ్యారు.
గోలీమార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మళ్లీ ‘‘వాంటెడ్ ’’ అనే ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేశాడు. బి.వి.ఎస్ రవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వెంటనే కాస్త రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో ‘‘మొగుడు’’ చేశాడు. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. ఈ సారి మళ్లీ కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించాడు. తనకు ‘‘ఒక్కడున్నాడు’’లాంటి మంచి సినిమా ఇచ్చిన చంద్రశేఖర్ యేలేటి తో ‘‘సాహసం’’ అనే ట్రెజర్ హంట్ సినిమా చేశాడు.ఆ సినిమా మంచి సక్సెస్ కొట్టింది. తను మూస ధోరణిలో కాకుండా డిపరెంట్ గా ట్రై చేస్తానని ప్రేక్షకులకు చెప్పకనే చెప్పాడు. ఆ సినిమా తన కెరీర్ ను నిలబెట్టింది.
ఆ తర్వాత 2014లో వచ్చిన ‘‘లౌఖ్యం’’ గోపిచంద్ కు మంచి కమర్షియల్ సూపర్ హిట్ ఇచ్చింది.తన కెరీర్ లో నే అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన మూవీ ఇది. దసరా సీజన్ లో రిలీజైన ఈ మూవీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు వెక్కిరించాయి. ఒకే పంథాలో చేసిన జిల్, సౌఖ్యం, గౌతమ్ నందా, ఆక్సిజన్ లు బాగా నిరాశపరిచాయి. ఈ దెబ్బలతో గోపిచంద్ కెరీర్ లో వెనకపడ్డాడు. అయినా ఎక్కడా తగ్గలేదు. వరుసగా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకున్నాడు. "పంతం" అనే మరో కమర్షియల్ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు. రీసెంట్ గా వచ్చిన ‘‘సీటిమార్’’ గోపిచంద్ కు కాస్త రిలీఫ్ ను ఇచ్చింది. మంచి కలెక్షన్ లతో ఆ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితో ‘‘పక్కా కమర్షియల్ ’’ అనే సినిమాతో జూలై 1న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీపైనే అంచనాలు పెట్టుకున్నాడు గోపి.
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను గోపీచంద్ పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఫ్యూచర్ లో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.