హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం.. 20 వేల మంది పోలీసులు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం.. 20 వేల మంది పోలీసులు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా నగరవ్యాప్తంగా 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

10 వేల సీసీ కెమెరాలతో నిఘా

నగరంలో ఏర్పాటు చేసిన సుమారు 10 వేల సీసీ కెమెరాల ద్వారా క్షణక్షణం పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర మార్గాలపై 24 డ్రోన్లతో ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. విగ్రహాల లెక్కింపునకు 100 హైరైజ్ కెమెరాలను వినియోగించనున్నారు. బంజారాహిల్స్‌లోని TGICCC నుంచి శోభాయాత్రను పర్యవేక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రాంతాల్లో IG, DIG స్థాయి అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

అదనపు బలగాల మోహరింపు

గణేష్ నిమజ్జనం కోసం 8,142 మంది అదనపు పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 42 ప్లాటూన్లతో పాటు నాలుగు RAF, రెండు CRPF కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. అనుమానాస్పద కదలికలు, పేలుడు పదార్థాల తనిఖీల కోసం 53 BD టీమ్స్‌ను రంగంలోకి దించనున్నారు.నిమజ్జనం జరిగే జలాశయాల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు సిద్ధంగా ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు.

శోభాయాత్ర సందర్భంగా DJలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్దం చేసే పరికరాల వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళల భద్రతకు 26 షీ-టీమ్స్

మహిళల భద్రత కోసం 26 షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి ఇప్పటివరకు 1,172 మంది ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నేర నియంత్రణ కోసం CCS నుంచి 25 ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు.

శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రధాన కూడళ్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మెకానిక్‌లు, అదనపు డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ అధికారులు కోరారు.