
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ లో భాగంగా పాకిస్తాన్ తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఇండియా ఛాంపియన్స్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చాలామంది భారత ఆటగాళ్లు పాకిస్థాన్ తో మ్యాచ్ బహిష్కరించాలని కోరడంతో మ్యాచ్ రద్దయింది. అంతకముందు పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా శిఖర్ ధవన్ సహా పలువురు ఇండియా వెటరన్ ప్లేయర్లు పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించగా.. సెమీ ఫైనల్ కూడా ఆడకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పాక్ సెమీస్ కు వెళ్లగా టీమిండియా మ్యాచ్ ఆడకుండానే ఇంటిదారి పట్టింది.
ఇండియా ఛాంపియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశామంతా వీరిని గౌరవించింది. ఆట కంటే దేశమే ముఖ్యమనే వీరి నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. అయితే లెజెండ్స్ లీగ్ రద్దు చేసుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ తో తలపడేందుకు టీమిండియా బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుబాయ్ వేదికగా పాకిస్తా, ఇండియా ఆసియా కప్ లో ఆడబోతున్నారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ తప్పుబట్టారు. బీసీసీఐ వైఖరిని తప్పుపడుతూ మ్యాచ్ నిర్వహించకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2025 లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలనే బీసీసీఐ నిర్ణయాన్ని హర్భజన్ సింగ్ తీవ్రంగా విమర్శించాడు. జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత సైనికులు చేసిన అపారమైన త్యాగాలతో పోలిస్తే క్రికెట్ పోటీ చాలా తక్కువ అని బీసీసీపై ఫైరయ్యాడు. ఏ వ్యక్తి దేశం కంటే పెద్దవాడు కాదని.. పాకిస్థాన్ మ్యాచ్ లు పూర్తిగా బహిష్కరించాలని ఈ వెటరన్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ లో 2025 లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత ఆటగాళ్ళు బహిష్కరించిన కొన్ని వారాల తర్వాత హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లు దుబాయ్, అబుదాబిలో జరగనున్నాయి. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య అబుదాబిలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్ధులు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దాయాధి జట్లు దుబాయ్ వేదికగానే లీగ్ మ్యాచ్ ఆడడం విశేషం. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది.