
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. రెండేళ్లుగా టీ20 ఫార్మాట్ లో భారత జట్టుకు తిరుగులేకుండా పోతుంది. వెస్టిండీస్ లో జరిగిన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 సిరీస్ ఓడిపోకుండా వస్తుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించినా ఆ ప్రభావం జట్టుపై పడలేదు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఆసియా కప్ లో భారత జట్టును ఓడించడం కాదు కదా కనీసం పోటీ ఇచ్చే జట్టే కనిపించడం లేదు.
మరోవైపు ఇటీవలే టీ20 క్రికెట్ లో ఘోరంగా ఆడుతున్న పాకిస్థాన్ ఈ టోర్నీలో అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది. అయితే పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ మాత్రం మరోసారి బీరాలు పలికాడు. త్వరలో జరగబోయే ఆసియా కప్ లో తమ జట్టు కంటే బలమైన జట్టు లేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ జట్టుపై రౌఫ్ కు నమ్మకముండొచ్చు. కానీ తమను మించిన ఫేవరేట్స్ లేరని చెప్పుకోవడం అతిగా అనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్‌లో భారత్తో జరిగే రెండు మ్యాచులు మేమే గెలుస్తామని బీరాలు పలికిన ఈ పాక్ పేసర్.. తాజాగా అన్ని జట్ల కంటే తమ జట్టే ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. హారిస్ రవూఫ్ అతివిశ్వాసంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘మీరు గెలిచేది లేదు.. సచ్చేది లేదు.. అన్ని ఉద్దేర మాటలే’’ అంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ రవూఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్థాన్ ఆసియా కప్ జట్టులో హారిస్ రవూఫ్ ఎంపికైన విషయం తెలిసిందే.
2025, సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికగా ఆసియా కప్-2025 జరగనుంది. ఈ సారి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ కాంటినెంటల్ టోర్నీలో పాకిస్తాన్, ఇండియా, ఒమన్, యూఏఈ జట్లు గ్రూప్ ఏలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. సమీకరణలన్నీ అనుకున్నట్లుగా జరిగితే సూపర్4 స్టేజ్లో ఒకసారి, ఫైనల్ పోరులో మరోసారి ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశం ఉంది.