నిర్మలా సీతారామన్​ దిగజారి మాట్లాడుతున్నారన్న హరీష్ రావు

నిర్మలా సీతారామన్​ దిగజారి మాట్లాడుతున్నారన్న హరీష్ రావు
  • మునుగోడులో లోకల్​ లీడర్ల కోసం 200 బ్రిజా కార్లు, 2 వేల బైక్​లు బుక్​ చేసిన్రు
  • వీటిపై టీఆర్​ఎస్​ స్క్వాడ్స్​ పెడ్తం.. ఈసీకి ఫిర్యాదు చేస్తం: హరీశ్ 
  • బండి సంజయ్​ భూత వైద్యం కోర్సు చేస్తే బెటర్​ అని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎన్ని ఆశలు చూపినా, విమానాలు కొనిచ్చినా మునుగోడు ఓటర్లు అభివృద్ధికే పట్టం కడుతారని, టీఆర్​ఎస్​నే గెలిపిస్తారని మంత్రి హరీశ్​రావు అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ దొడ్డి దారిన గెలవాలని చూస్తున్నదని, లోకల్​ లీడర్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్​ఎస్​ఎల్పీ ఆఫీస్​లో ఆదివారం హరీశ్​  మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడులో లీడర్లను కొనడమే కాకుండా.. కార్లు, మోటర్​ బైక్​లు కొనిస్తమని బీజేపీ చెప్తున్నది. మాకున్న సమాచారం ప్రకారం కొత్తగా 200 బ్రిజా కార్లు, 2 వేల మోటర్​ సైకిళ్లు ఆ పార్టీ బుక్​ చేసింది. వీటన్నింటిపై మండలాల్లో టీఆర్ఎస్​ స్క్వాడ్స్​ పెడ్తం. అన్నింటిపై ఈసీకి కంప్లయింట్​ ఇస్తం” అని అన్నారు. ‘‘ఇయ్యాల కార్లు, మోటర్లు ఇస్తారేమో.. రేపు బావుల కాడ మీటర్లు పెడ్తరు. మోటర్ కావాలో.. మీటర్ కావాలో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలి.  మొన్న రాజగోపాల్ రెడ్డి కూడా మీటర్లు పెడితే తప్పేంటి అన్నడు. ప్రజల ఆత్మ గౌరవం నిలబడాలో.. రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలో ఆలోచన చేయాలి” అని హరీశ్​ పేర్కొన్నారు. మునుగోడులో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని అందరూ చూస్తున్నారని అన్నారు.  

మా దగ్గర లోక్​ తాంత్రిక విద్యలు ఉన్నయ్​
‘‘మతాలను రెచ్చ గొట్టి అధికారం కోరుకునేది బీజేపీనే. ఒకాయన  క్షుద్ర పూజలు అంటరు. కేంద్ర మంత్రేమో మూఢ నమ్మకాలు అంటరు. అవన్నీ చేసేది వాళ్లే. మంత్ర, తంత్రాలతో అధికారంలోకి వచ్చామా?  భూత వైద్య కోర్సు బెనారస్ వర్శిటీలో పెట్టింది బీజేపీ సర్కార్ కాదా? దేశంలో తాంత్రిక విద్యలు బీజేపీ వాళ్లకు  తెలిసినంత ఎవరికీ తెల్వదు” అని హరీశ్​రావు దుయ్యబట్టారు. బండి సంజయ్ భూత వైద్యం కోర్సు చేస్తే మంచిదేమోనని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తమ దగ్గర తాంత్రిక విద్యలు లేవని.. లోక్ తాంత్రిక విద్యలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాలపై కేంద్రం శ్వేత పత్రం రిలీజ్​ చేస్తే తాము కూడా చేస్తామని చెప్పారు. బీఆర్​ఎస్​ పేరుతో తెలంగాణ మోడల్​ను దేశం మొత్తం అమలు చేసేందుకు కేసీఆర్ బయల్దేరారని హరీశ్​ చెప్పారు. ‘‘అప్పుడు టీఆర్​ఎస్ ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్​ను టీడీపీ బీ టీం అని, చంద్రబాబు ఏజెంట్ అని అన్నరు. అలాంటివి మస్త్ చూసినం. ఇప్పుడు అలాంటి మాటలే వస్తున్నయ్​. బీజేపీవి చెప్పేవి నీతులు, తవ్వేది గోతులు” అని హరీశ్ దుయ్యబట్టారు. ప్రజాధనం వృధా చేసేందుకే మునుగోడు బైపోల్​ తీసుకొచ్చారని మండిపడ్డారు.