24 గంటల కరెంట్‌‌ను ఎత్తేస్తరు..రైతు డిస్కమ్ వెనుక కాంగ్రెస్ కుట్రలు: హరీశ్‌‌రావు

24 గంటల కరెంట్‌‌ను ఎత్తేస్తరు..రైతు డిస్కమ్ వెనుక కాంగ్రెస్ కుట్రలు: హరీశ్‌‌రావు
  • 3 గంటల కరెంట్​చాలని కోదండరెడ్డి చెప్పిండు
  • రేవంత్​ మనసులోని మాటలే ఆయన ఈఆర్సీ ముందు చెప్పారని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: రైతులకు 24 గంటల కరెంట్​ విషయంలో కాంగ్రెస్​ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్‌‌రావు మండిపడ్డారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్​ కుట్రలు అవేనని అన్నారు. ‘‘రైతులకు 24 గంటల కరెంట్​ అవసరం లేదు.. 3 గంటలు చాలు’’ అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్​ నేత, రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. రేవంత్​ ప్రభుత్వ రైతు వ్యతిరేక మొఖాన్ని బయటపెట్టిందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అది కోదండరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదని, రేవంత్‌‌రెడ్డి మనసులోని ఆలోచన అని పేర్కొన్నారు. అమెరికా వేదికగా రేవంత్‌‌రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘పొలం అంటే ఏమిటో.. బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.. రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడ్తరు.

తమ బీఆర్ఎస్​ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది. రుణమాఫీ అటకెక్కించారు. రైతు బంధు బంద్ చేశారు. పంట బోనస్ బోగస్ చేశారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు.

పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు. ఇవి చాలదన్నట్టు కేసీఆర్ ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్‌‌ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారు. కరెంట్ కోతలతో.. రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.  

 కొనుగోళ్ల లక్ష్యం సైలెంట్‌‌గా తగ్గించారు

ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల  టన్నుల నుంచి 75 లక్షల  టన్నులకు సైలెంట్‌‌గా తగ్గించిన మంత్రి ఉత్తమ్.. మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమోనని హరీశ్‌‌రావు అన్నారు. ఓ వైపు 1.41 కోట్ల టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూనే కొనుగోలు మాత్రం 75 లక్షల టన్నులకే పరిమితం చేశారని విమర్శించారు. 2020–-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.

“వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా? కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా? తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా? డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలుచేసింది అబద్ధమా?” అని నిలదీశారు.