- 110 అప్లికేషన్లు వస్తే 25 ఎంపిక చేస్తరట: హరీశ్ రావు
- అందులో మంత్రి కోటా 4, మంత్రి అనుచరుడి కోటా 21
- ఒక్కో బ్రూవరీకి రూ.1.80 లక్షల చొప్పున వసూళ్లు అని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సింగరేణిలోనే కాకుండా ఆబ్కారీ శాఖలో కూడా అవినీతి జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మైక్రోబ్రూవరీస్ కోసం 110 అప్లికేషన్లు వస్తే.. ప్రభుత్వం కేవలం 25 బ్రూవరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో ఓ మంత్రి కోటా 4, ఆ మంత్రికి అత్యంత క్లోజ్‌గా ఉండే ఓ ముఖ్య నాయకుడి కోటా 21 బ్రూవరీలు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. ఒక్కొక్క బ్రూవరీకి రూ.1.80 లక్షలు వసూలు చేస్తున్నారని, అందులో రూ.కోటిన్నర మంత్రికిపోనూ మిగతా రూ.30 లక్షలు తోడునీడలా ఉంటున్న ఆ ముఖ్యనేతకు పోతున్నాయని పేర్కొన్నారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆ ముఖ్య నాయకుడు ఈ మధ్య కాలంలో మంత్రి ఇంట్లోనే తోడునీడలా ఉంటున్నారని, ఇటీవల తిరుపతి వెళ్తే కూడా ఆయన వెంటే ఉన్నాడని పేర్కొన్నారు. 110 అప్లికేషన్లు వచ్చినప్పుడు వైన్స్ మాదిరి లాటరీ ఎందుకు తీయడం లేదని హరీశ్ ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు ప్రభుత్వం రూ.4,500 కోట్లు బకాయి పడిందని విమర్శించారు. వాటాల పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయన్నారు. ఇదిలాగే జరిగితే రాబోయే రోజుల్లో కొన్ని బ్రాండ్స్‌ను నిలిపేసే పరిస్థితి ఉన్నదని చెప్పారు.
రైతులకన్నా బీర్ల కంపెనీలే ఎక్కువా..
రైతుల కంటే బీర్ల కంపెనీలే ముఖ్యమనే రీతిలో ప్రభుత్వం తీరుందని హరీశ్ విమర్శించారు. సింగూరు డ్యామ్‌కు రిపేర్ల పేరిట రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారని, సంగారెడ్డి జిల్లాలో 40 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 30 వేల ఎకరాలకు నీళ్లందని పరిస్థితి ఉందని చెప్పారు. అదే సమయంలో సంగారెడ్డి జిల్లాలోని బీర్ల కంపెనీలకు మాత్రం ఆటంకం లేకుండా నీటి పంపిణీ జరుగుతున్నదని విమర్శించారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీటి సరఫరా ఆపేసి.. బీర్ల కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడాలని చెప్పారన్నారు. ప్రభుత్వానికి రైతులంటే చులకన అని మండిపడ్డారు.
