V6 News

ఆర్టీసీ కార్మికుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

ఆర్టీసీ కార్మికుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
  •     సమ్మెకు బీఆర్ఎస్​ మద్దతు: హరీశ్​

సిద్దిపేట, వెలుగు : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన సిద్దిపేట ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 

రెండున్నరేండ్లుగా సమస్యలను పరిష్కరించకపోవడంతోనే  సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.  హైదరాబాద్ లో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారనే ప్రచారం జరుగుతోందని.. మహాలక్ష్మి స్కీమ్​వచ్చిన తర్వాత డ్రైవర్లు, కండక్టర్ల మీద ఒత్తిడి పెరిగిందని వివరించారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కోదండరాం లాంటి మేధావులు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి  మధ్య విభేదాలున్నాయని.. గతంలో ఆర్టీసీకీ  సీఎం ఇచ్చిన రూ. 200 కోట్ల చెక్కు చెల్లలేదన్నారు. 

ఏపీలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారని, ఇక్కడ ఎందుకు గుర్తించడంలేదో  సీఎం  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను కుదువ పెట్టుకుని ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంటోదని విమర్శించారు.గతంలో తాము  ఆర్డర్ చేసిన బస్సులకే సీఎం జెండా ఊపి    ప్రారంభిస్తున్నారని ఏద్దేవా చేశారు. ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని..పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంట్రాక్ట్​ డ్రైవర్లను నియమించి  ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటోందని హరీశ్ రావు విమర్శించారు.