
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియాతో పాటు పార్లమెంటును అబద్దాలకు వేదికగా వాడుకుంటోందని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం ప్రతిపాదనలు పంపినా కేంద్రం తొక్కిపెట్టిందని హరీష్ విమర్శించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు ప్రతిపాదనలే రాలేదని కేంద్ర మంత్రి సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. తప్పుడు సమాధానం చెప్పిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని చెప్పారు. సొల్లు పురాణం చెప్పే రాష్ట్ర బీజేపీ నేతలు దమ్ముంటే ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని హరీష్ రావు సవాల్ విసిరారు.
ఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తీరుకు నిరసనగా మంత్రి హరీష్ రావు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తడిగుడ్డతో గొంతు కోస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ గిరిజన యూనివర్సిటీల్లో నిరసనలు చేపట్టాలని అన్నారు. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెప్పిన మంత్రికి గ్రామగ్రామాన శవయాత్రలు జరపాలని పిలుపునిచ్చారు.