వైద్యవృత్తి.. మానవతా ధర్మం...కరోనా టైమ్‌‌లో పీపీఈ కిట్ల రూపంలో దేవుళ్ల ప్రతినిధులుగా డాక్టర్లు: హరీశ్రావు

వైద్యవృత్తి.. మానవతా ధర్మం...కరోనా టైమ్‌‌లో పీపీఈ కిట్ల రూపంలో దేవుళ్ల ప్రతినిధులుగా డాక్టర్లు: హరీశ్రావు

హైదరాబాద్, వెలుగు: కరోనా ప్రపంచాన్ని భయపెట్టిన సమయంలో దేవుళ్లు కనిపించలేదు గానీ పీపీఈ కిట్లలో ఉన్న డాక్టర్లు మాత్రం దేవుళ్ల ప్రతినిధులుగా కనిపించి ప్రజల ప్రాణాలు కాపాడారని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. వారి సేవలను ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదని చెప్పారు. ఎంతో మంది వైద్యులు ప్రైవేటులో వచ్చే మంచి జీతాలను వదులుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారని, ప్రైవేటులో ఉన్నవారు నామమాత్రపు ఫీజులతో సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని సోమాజిగూడ పార్క్ హోటల్‌‌లో నిర్వహించిన తెలంగాణ డాక్టర్స్​ఎక్సలెన్స్​అవార్డ్స్​కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తి మానవతా ధర్మమని వెల్లడించారు. 

ఏటా పదివేల మంది డాక్టర్లను తయారు చేస్తూ తెలంగాణ వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచిందని ఆయన వివరించారు. ఇతర పథకాలతో గ్రీన్, బ్లూ, వైట్ రెవల్యూషన్స్ సాధించిన తెలంగాణ.. జిల్లాకో మెడికల్ కాలేజీతో  ‘వైట్‌‌ కోట్ రివల్యూషన్’ కూడా సాధించిందని తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని, ఇదంతా ప్రజలు చెల్లించిన డబ్బేనని చెప్పారు.