హైదరాబాద్, వెలుగు: దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంటూ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి సోమవారం లీగల్ నోటీసులు పంపించారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని తాను క్షుద్ర పూజలు చేశానని చెప్పడం పూర్తిగా అబద్ధమని హరీశ్ రావు అన్నారు.
పుట్టినరోజు, మొక్కులు తీర్చుకోవడం వంటి సందర్భాల్లో కుటుంబంతో కలిసి గుడికి వెళ్లడం తమ సంప్రదాయమని చెప్పారు. అలాంటి విషయాన్ని వక్రీకరించి రాజకీయాల కోసం దేవాలయాలను, దేవుళ్లను వాడుకోవడం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ఫెయిల్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. ఏ టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, ఇతర వేదికల్లో ఆరోపణలు చేశారో, అదే వేదికల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.
అలాగే తప్పుడు వీడియోలు, పోస్టులు, ఇతర ప్రచారాన్ని వెంటనే తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, తప్పుడు ప్రచారాన్ని తొలగించకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు హెచ్చరించారు.
