దేశ ముఖచిత్రంలో ములుగు జిల్లా నిలవడం గర్వకారణం

దేశ ముఖచిత్రంలో ములుగు జిల్లా నిలవడం గర్వకారణం

ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి హరీశ్ రావు. ఆయన వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. గట్టమ్మ ఆలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు.
ములుగు ఏరియా ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్, పిడియాట్రిక్ యూనిట్ ప్రారంభించారు. తెలంగాణ ఈహెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.  అనంతరం మంత్రులు మాట్లాడారు. 

సంక్షేమ పతకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మరో అద్భుత కార్యక్రమం ఈ-హెల్త్ ప్రొఫైల్ అన్నారు. దేశంలో ఈ-హెల్త్ ప్రొఫైల్ ఉన్న మొట్టమొదటి జిల్లాగా దేశ ముఖచిత్రంలో ములుగు జిల్లా నిలవడం గర్వకారణమన్నారు. భారత దేశంలో మొట్టమొదట హెల్త్ ప్రొఫైల్ ములుగు - సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించు కోవడం శుభ సూచికమన్నారు. 40రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసి..ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డ్ అందిస్తామన్నారు.

197 మెడికల్ టీమ్స్ పని చేస్తాయన్నారు. పేషెంట్ హెల్త్ హిస్టరీ తెలియడం వల్ల వారికి మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఇక మీదట ఇంటికే ఆశ వర్కర్ల ద్వారా మందులు అందిస్తామన్నారు. ఒక గ్రామపంచాయతీ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడం.. కేవలం ములుగు జిల్లాకే ఆ కీర్తి దక్కిందన్నారు మంత్రి హరీశ్ రావు. గిరిజన యూనివర్సిటీ పేరుతో కేంద్రం గిరిజనులను మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్రం కనీసం గిరిజనులకు ఉన్న రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ... ములుగు జిల్లా అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న సీఎం కేసీఆర్ కు ఈ జిల్లా ప్రజలు రుణపడి వుంటారన్నారు. ఈ-ప్రొఫైల్ ఈ జిల్లాలో ప్రారంభించడం ఇక్కడి ప్రజలు చేసుకున్న వరమన్నారు. ప్రతీ పనిని రాజకీయాలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. అభివృద్ధి విషయంలో సలహాలు ఇవ్వండి రాజకీయాలు వద్దన్నారు. విభజన చట్టంలోని హామీలు విస్మరించింది ఎవరూ..? అంటూ  ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం పూర్తి వివక్ష చూపుతుందని విమర్శించారు. బీజేపీ నాయకులు అభివృద్ధిని విస్మరించి.. కేవలం విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వలేదన్నారు. 

ఈ హెల్త్ ఫ్రొఫైల్ వల్ల గిరిజనులకే ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా హాజరయ్యారు.అన్ని జిల్లాలను సమాంతరంగా చూసినప్పుడే తెలంగాణ సమాంతరంగా అభివృద్ధి చెందుతుందన్నారు సీతక్క. జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలి, అంతేస్థాయిలో నిధులు ఇవ్వాలన్నారు. గిరిజన యూనివర్సిటీపై స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా సీతక్క డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండి:

బాంబు దాడులపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు

యాదాద్రి ముహూర్త పత్రాలకు పూజలు