మల్కాజిగిరి, వెలుగు: రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22ఏ నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మంగళవారం మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
రంగారెడ్డిలో జీవో 7500 ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లోని వేలాది భూములు, హెచ్‌ఎండీఏ, హెచ్‌యూడీఏ పరిధిలోని భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు. భూ విక్రయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే వరకు తమ ఆస్తి 22ఏ జాబితాలో ఉందనే విషయం ప్రజలకు తెలియడం లేదన్నారు. 22ఏ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
క్షమాపణలతో ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. భూములను జాబితాలో చేర్చింది ఎవరు, ఎవరి ఆదేశాలతో చేర్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై నెపం వేసి ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదన్నారు. ఈ సమస్యపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
