- పద్దులో ఏముందో తెలియకుండా కట్మోషన్ ఎలా ఇస్తం: హరీశ్ రావు
- పద్దులను ఇప్పటిదాకా ఇవ్వలేదని నిరసిస్తూ వాకౌట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ అంటే అధికారులకు లెక్కలేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. టూరిజం, ఆర్ట్స్, కల్చరల్, స్పోర్ట్స్, మైనారిటీ వెల్ఫేర్పద్దుల బుక్కులు ఇప్పటిదాకా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పద్దులో ఏముందో తెలియకుండా కట్మోషన్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు. మంగళవారం సభలో ఆయన పాయింట్‌ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు.
సభను నడిపే పద్ధతి ఇది కాదంటూ విమర్శించారు. సభ ఉదయం 10 గంటలకు స్టార్ట్ కావాల్సి ఉన్నా మొదలు పెట్టడం లేదని, టీ బ్రేకులు 10 నిమిషాలని చెప్పి 4 గంటలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రిప్లై రోజు ఢిల్లీ టూర్ నుంచి తిరిగి
రావాలన్న కారణంతో అంత లేట్ చేశారన్నారు. సీఎం రిప్లై ఇచ్చాక కనీసం తాము క్లారిఫికేషన్ అడిగితే కూడా ఇవ్వకుంటే సభలో తామెందుకు కూర్చోవాలని నిలదీశారు. సోమవారం కూడా 12 గంటలకు టీ బ్రేక్ ఇస్తే.. 3.30 దాకా మళ్లీ ప్రారంభించలేదన్నారు.
తాను సభలో మాట్లాడేది ఉందని ఎప్పుడు బెల్కొడతారోనని సభలోనే కూర్చుండిపోయానన్నారు. మంగళవారం కూడా భట్టి ప్రిపరేషన్ కోసమని బ్రేక్‌ను గంటన్నర సేపు ఇచ్చారన్నారు. దానికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా.. భట్టి విక్రమార్క రిప్లై వినకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, అసెంబ్లీ గ్రౌండ్లో ఈ నెల 28, 29వ తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్టు స్పీకర్ తెలిపారు. ఆసక్తి ఉన్న సభ్యులు బుధవారం సెక్రటరీకి పేర్లు ఇవ్వాలని స్పీకర్ అసెంబ్లీలో ప్రకటించారు.
పార్టీ ఆఫీసును నడిపినట్టు నడిపిన్రు: మంత్రి శ్రీధర్ బాబు
సభ నడిపే తీరు బీఆర్ఎస్ వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో.. పార్టీ ఆఫీసును నడిపినట్టే సభను నడిపారని మండిపడ్డారు. సీఎం స్పీచ్ తర్వాత ఎన్ని ప్రశ్నలు అడిగినా.. జవాబు చెప్పారని, క్లారిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. మంగళవారం సభలో హరీశ్ రావుకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బడ్జెట్ పద్దులను.. ఆనాటి ఆర్థిక మంత్రి రిప్లై ఇవ్వడానికి ఐదు నిమిషాల ముందు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఇక్కడ ఒకటో రెండో పుస్తకాలివ్వనందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. ఒక్కోసారి సభ లేట్ అవుతుందని, దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లకు అంత పెద్ద పనేముందని వాకౌట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భట్టి రిప్లైకి ఏం సమాధానం చెప్పాలో తెలియక.. రెండింతల జవాబొస్తుందని భయపడి సభ నుంచి వాకౌట్ చేశారని ఫైర్ అయ్యారు.
