V6 News

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్..తాలు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ ఏడికి పోయిండు: హరీశ్రావు

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్..తాలు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ ఏడికి పోయిండు: హరీశ్రావు
  • మిల్లుల దగ్గర బస్తాకు 5 కిలోల తరుగు తీస్తున్నరని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రకటించిన రైతు డిక్లరేషన్​ ఓ బోగస్​ అని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు అన్నారు. బుధవారం ఆయన సీఎం రేవంత్​ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తాలు పేరుతో తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలన్నారు. శనగలకు మద్దతు ధర రూ.5,875 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే అమ్ముకునే దుస్థితి వచ్చిందన్నారు. జొన్నల కనీస మద్దతు ధర రూ.3371 ఉంటే, ప్రైవేట్ వ్యక్తులకు కేవలం రూ.2500కే రైతులు అమ్ముకోవాల్సి వస్తున్నదన్నారు. మొక్క జొన్నను ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని కోరారు. 

రుణమాఫీ కోసం హైకోర్టులో రిట్ పిటిషన్‌‌‌‌

సిద్దిపేట: నియోజకవర్గంలో 22,849 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారి పక్షాన హరీశ్​రావు ఆర్టికల్ 226 కింద హై కోర్టులో రిట్​పిటిషన్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 43,363 మంది ఉండగా కేవంల 20,514 మంది కి మాత్రమే రుణ మాఫీ జరిగిందన్నారు. మిగతా వారికి రుణ మాఫీ చేయాలని అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైనవారందరికీ రుణమాఫీ చేసి బ్యాంకుల బారి నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు.