హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని, రైతు డిస్కం పేరిట మూడో డిస్కం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా రైతులు సహా అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోందని మండిపడ్డారు.
బుధవారం ఈఆర్సీకి హరీశ్ లేఖ రాశారు. ఆచరణ సాధ్యం కాని విధానాలతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. “మూడో డిస్కం లైసెన్స్ మంజూరుకు సంబంధించి కమిషన్‌పై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం చూస్తే.. విచారణ పూర్తికాకముందే తీర్పు చెప్పినట్లుగా కనిపిస్తోంది.
జీవో 44లో ఆర్థిక పరమైన అంశాలను పేర్కొంటూ మూడో డిస్కం ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. థర్డ్ డిస్కం ఏర్పాటు చేయడం ఆర్థిక పరమైన విషయాల గురించే తప్ప రైతుల సంక్షేమం గురించి కాదని అర్థం అవుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయంపై బహిరంగ విచారణను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయరాదు. అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణలు నిర్వహించాలి” అని ఆయన కోరారు.
