అదేంటి.. భారతదేశానికి తూర్పున ఉంటే.. మరి పశ్చిమ బెంగాల్ అని పేరు ఎందుకు వచ్చింది ?

అదేంటి.. భారతదేశానికి తూర్పున ఉంటే.. మరి పశ్చిమ బెంగాల్ అని పేరు ఎందుకు వచ్చింది ?

భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రానికి "పశ్చిమ బెంగాల్" అనే పేరు ఎందుకు వచ్చిందనేది చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం.  భారతదేశ మ్యాప్‌ను మనం గమనిస్తే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మన దేశానికి తూర్పు చివరన ఉంటుంది. దేశానికి తూర్పున ఉన్న ప్రాంతానికి 'పశ్చిమ' అనే పదం ఉండటం వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది. ఈ పేరు వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి, ముఖ్యంగా దేశ విభజన నాటి రోజుల్లోకి వెళ్లాలి.

 ఉమ్మడి బెంగాల్ 
ఒకప్పుడు బెంగాల్ అనేది చాలా పెద్ద, సంపన్నమైన ప్రాంతం. గంగా, బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్న  ఈ ప్రాంతం కళలకు, సాహిత్యానికి, రాజకీయాలకు ప్రధాన  కేంద్రంగా ఉండేది. బ్రిటిష్  కాలంలో 'బెంగాల్ ప్రెసిడెన్సీ' కింద ఇప్పటి పశ్చిమ బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్, బీహార్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు కూడా కలిసి ఉండేవి. అప్పట్లో దీనిని కేవలం బెంగాల్ అని మాత్రమే పిలిచేవారు.

  'విభజించి పాలించు' విధానం 
బెంగాల్ ప్రజల్లో పెరుగుతున్న దేశభక్తిని, స్వాతంత్ర  ఆశలను దెబ్బతీయడానికి బ్రిటిష్ వారు కుట్ర పన్నారు. అందులో భాగంగానే 1905లో అప్పటి వైస్రాయ్ 'లార్డ్ కర్జాన్' బెంగాల్‌ను రెండుగా విడదీశారు. ఒకటి తూర్పు బెంగాల్.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం. మరొకటి పశ్చిమ బెంగాల్... హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం.

అయితే, ఈ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమం, నిరసనలు చేపట్టారు. దాంతో తలవంచిన బ్రిటిష్ ప్రభుత్వం 1911లో 'లార్డ్ హార్డింగ్' ఆధ్వర్యంలో ఈ విభజనను రద్దు చేసి మళ్లీ కలిపేసింది. కానీ, వారి మనసుల్లో పడిన విభజన బీజాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

 1947 దేశ విభజన ఇంకా పశ్చిమ బెంగాల్ పుట్టుక
బెంగాల్‌కు 'పశ్చిమ' అనే పదం శాశ్వతంగా ఉండిపోవడానికి ముఖ్య కారణం 1947 నాటి భారతదేశ విభజన. మతం ఆధారంగా దేశం విడిపోయినప్పుడు, పాత బెంగాల్ ప్రావిన్స్ మళ్లీ రెండు ముక్కలైంది:

ALSO READ : CBSE 12 క్లాస్ పిల్లల బాధలు కనిపించటం లేదా మోదీ 

 పశ్చిమ బెంగాల్ అయినా హిందువులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం భారతదేశంలో కలిసిపోయింది. అప్పటి నుండి దీనిని అధికారికంగా పశ్చిమ బెంగాల్" అని పిలవడం ప్రారంభించారు. తూర్పు భాగం అయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం పాకిస్తాన్‌తో కలిసి 'తూర్పు పాకిస్తాన్'గా మారింది.

పాత ఉమ్మడి బెంగాల్‌కు ఇది పశ్చిమ వైపున ఉన్న ముక్క కాబట్టి, మన దేశానికి తూర్పున ఉన్న దీనికి పశ్చిమ బెంగాల్ అనే పేరు స్థిరపడిపోయింది.

 1971లో  యుద్ధం
1971లో జరిగిన యుద్ధం తర్వాత, పాకిస్తాన్ నుండి విడిపోయి 'తూర్పు పాకిస్తాన్' కాస్తా "బంగ్లాదేశ్" అనే స్వతంత్ర దేశంగా మారింది. అవతలి భాగం పేరు బంగ్లాదేశ్‌గా మారినప్పటికీ, మన దేశంలోని రాష్ట్రం చారిత్రక గుర్తింపు కోసం 'పశ్చిమ బెంగాల్' అనే పేరునే కొనసాగిస్తూ వచ్చింది.
 
రాష్ట్రాల పేర్ల లిస్టులో  ఈ రాష్ట్రం పేరు 'W' అంటే West Bengal తో మొదలవడం వల్ల కేంద్ర ప్రభుత్వ సమావేశాలలో వీరికి చివరిగా మాట్లాడే అవకాశం వస్తుంటుంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి ఈ రాష్ట్రం పేరును కేవలం బెంగాల్ లేదా బంగ్లా గా మార్చాలనే ప్రతిపాదనలు, విజ్ఞప్తులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.