సొంతిల్లు కొనుక్కోవటం అనేది.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఆ డ్రీమ్ నిజం చేసుకోవడానికి చాలామంది ఎంచుకునే ఏకైక మార్గం హోమ్ లోన్. అయితే బ్యాంకు మెట్లెక్కగానే మన ముందు నిలిచే అతిపెద్ద ప్రశ్న "సార్... మీకు ఫిక్స్‌డ్ రేట్ లోన్ కావాలా? లేక ఫ్లోటింగ్ రేట్ లోన్ కావాలా?" అన్నదే. ఈ మాట వినగానే కొత్తగా లోన్ తీసుకునేవారికి కాస్త కన్ఫ్యూజన్ రావడం సహజం. రేటు తక్కువగా ఉంది కదా అని తొందరపడి నిర్ణయం తీసుకుంటే.. లాంగ్ రన్‌లో జేబుకు చిల్లు పడటం ఖాయం. మరి మీ బడ్జెట్‌కు, మీ ఫ్యామిలీకి ఏ లోన్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందో.. బ్యాంకుల్లో ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల లెక్కలతో సహా ఇప్పుడు క్లియర్ కట్‌గా తెలుసుకుందాం రండి..
అసలు ఏంటి ఈ రెండింటి మధ్య తేడా?
చాలా సింపుల్.. మన ఇళ్లలో వాడే కరెంట్ బిల్లు లాంటిదే ఈ వ్యవహారం కూడా.
* ఫ్లోటింగ్ రేట్ లోన్: దీని వడ్డీ రేటు ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్కెట్ పరిస్థితులు, RBI రెపో రేట్ల ఆధారంగా ఇది మారుతూ ఉంటుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే మీ ఈఎంఐ లేదా లోన్ కాలపరిమితి తగ్గుతుంది. ఒకవేళ ఆర్‌బీఐ రేట్లు పెంచితే లోన్ భారం కూడా పెరుగుతుందన్నమాట.
* ఫిక్స్‌డ్ రేట్ లోన్: పేరులోనే ఉంది కదా.. ఇది ఎప్పటికీ మారదు. మీరు లోన్ తీసుకునేటప్పుడు ఎంత వడ్డీ రేటు ఉంటుందో.. లోన్ తీరేవరకు అదే వడ్డీ రేటు మీ లోనుపై అప్లై అవుతుంది. మార్కెట్ ఒడిదొడుకులతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి నెలా ఎంత ఈఎంఐ కట్టాలో ముందే ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం.. ఫిక్స్‌డ్ రేట్లతో పోలిస్తే ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లే చాలా చౌకగా ఉన్నాయి. అయితే ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి:
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు:
1. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.10% – 10.25%
2. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 7.10% – 9.75%
3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.15% – 9.60%
4. కెనరా బ్యాంక్: 7.15% – 10.00%
5. ఇండియన్ బ్యాంక్: 7.15% – 9.55%
6. బ్యాంక్ ఆఫ్ బరోడా / పంజాబ్ నేషనల్ బ్యాంక్: 7.20% – 9.25%
ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లు:
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 8.20% – 10.75%
2. కెనరా బ్యాంక్: 8.50% – 10.75%
3. బ్యాంక్ ఆఫ్ బరోడా: 8.75% – 10.00%
4. ఐసీఐసీఐ బ్యాంక్: 8.90% – 11.20%
5. ఇండియన్ బ్యాంక్: 9.20% – 9.95%
ఇక్కడ ఫిక్స్‌డ్ రేట్లతో పోలిస్తే ఫ్లోటింగ్ రేట్లు దాదాపు 1% నుండి 1.5% వరకు తక్కువగా ఉన్నాయి. అంటే ప్రారంభంలో ఫ్లోటింగ్ రేట్ ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది.
మీకు ఏది సెట్ అవుతుంది? ఇలా డిసైడ్ అవ్వండి
ఏ లోన్ బెస్ట్ అనేది వడ్డీ రేట్లను బట్టి మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. భవిష్యత్తులో మార్కెట్ వడ్డీ రేట్లు తగ్గుతాయని మీరు భావిస్తే ఫ్లోటింగ్ రేట్లను ఎంచుకోవటం బెస్ట్. అయితే ఇందుకు రేపు పొద్దున ఆర్‌బీఐ రేట్లు పెంచి, ఈఎంఐ కాస్త ఎక్కువైనా భరించే ఆర్థిక స్తోమత కూడా అవసరం. తక్కువ వడ్డీతో లోన్ స్టార్ట్ చేయాలనుని.. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు లోన్‌ను త్వరత్వరగా కట్టేసి ముగించాలనే ప్లాన్ ఉంటే ఇది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.
మీకు ఈఎంఐలలో ఎలాంటి హెచ్చుతగ్గులు నచ్చవు, స్థిరత్వం కావాలనుకుంటే ఫిక్స్‌డ్ రేట్ లోన్ ఎంచుకోవటం మంచిది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు బాగా పెరిగిపోతాయనే భయం ఉన్న వారు దీనిని ఎంచుకోవచ్చు. మీ నెలవారీ బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేని పరిమిత ఆదాయం ఉన్నవారైతే ఢోకా ఉండదు. వీటికి తోడు కేవలం వడ్డీ రేట్లే కాదు, బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు కూడా ముఖ్యం. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు లోన్ మొత్తంలో 0.25% నుంచి 0.50% వరకు ఛార్జ్ చేస్తే.. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏకంగా 2% వరకు గుంజుతాయి. కాబట్టి లోన్ అప్లై చేసేముందే ఈ అదనపు ఖర్చులన్నీ లెక్కేసుకోండి. ఎందుకంటే ఒకసారి లోన్ తీసుకున్నాక దానిని 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కొనసాగించాల్సి ఉంటుందని గుర్తించి నిర్ణయాలు తీస్కోండి.
