న్యూఢిల్లీ: ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయ విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. విమాన కార్యకలాపాల నిర్వహణ భారం కావడం, వాణిజ్యపరంగా సర్వీసులను కొనసాగించడం కష్టతరంగా మారడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో తమ దేశీయ విమాన సర్వీసులను తగ్గించుకుంటున్నాయి.
వచ్చే నెల నుంచి ఆగస్టు వరకు సర్వీసుల కోతలు అమలులో ఉంటాయి. ఎయిర్ ఇండియా సంస్థ తన దేశీయ సర్వీసుల్లో 22 శాతం వరకు కోత విధిస్తుండగా, ఇండిగో సంస్థ తన దేశీయ సామర్థ్యంలో 5 నుంచి 7 శాతం మేర తగ్గించనుంది.
ఇండిగో సంస్థ తన అంతర్జాతీయ సర్వీసుల సామర్థ్యాన్ని కూడా 17 శాతం మేర తగ్గించడం గమనార్హం. కొన్ని మార్గాల్లో విమానాల రాకపోకల సంఖ్యను రాబోయే మూడు నెలలపాటు తగిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.
అంతర్జాతీయ సర్వీసులను తగ్గించిన తర్వాతే దేశీయ సర్వీసులనూ తగ్గించాలని నిర్ణయించింది. విమానాలకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్లే ఈ సర్దుబాట్లు చేయక తప్పలేదని ఈ కంపెనీ వివరించింది.
అంతర్జాతీయ కారణాలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు గత మూడు నెలల్లో 50 శాతానికిపైగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ ప్రాంతంలో సరఫరాకు ఆటంకాలు కలగడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు దారితీసింది. ప్రపంచ దేశాల ముడిచమురు రవాణాలో ఈ మార్గం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై నేరుగా ప్రభావం పడుతుంది.
సుదీర్ఘ కాలం పాటు సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనలతో ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చమురు మార్కెట్లలో నెలకొన్న ఈ అనిశ్చితి విమానయాన రంగానికి ఇంధన ఖర్చులను భారీగా పెంచేసింది.
ప్రస్తుతానికి బ్రెంట్ క్రూడాయిల్ ధర కొంత తగ్గి బ్యారెల్‌కు 96 డాలర్లు (సుమారు రూ.8 వేలు) వద్ద ట్రేడవుతున్నప్పటికీ, మునుపటి ధరలతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. విమానాల నిర్వహణ ఖర్చులో ఏటీఎఫ్ వాటాయే 40 శాతం ఉంటుంది. అందుకే సర్వీసుల సంఖ్య తగ్గుతోంది.
