కాళేశ్వరంలో పుణ్య స్నానాలు.. శివుడికి మొక్కులు

కాళేశ్వరంలో పుణ్య స్నానాలు.. శివుడికి మొక్కులు
  •     సరస్వతి అంత్య పుష్కరాల్లో  భక్తుల సందడి

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం భక్తులు వదిలే దీపాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పుష్కర స్నానాలు ప్రారంభించారు. సూర్యోదయ సమయంలో భక్తులు సూర్యునికి తర్పణం ఇచ్చి సూర్యనమస్కారాలు చేశారు. ఇసుకతో శివలింగాలు తయారు చేసి అభిషేకాలు నిర్వహిస్తూ తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థించారు. 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్డీపూర్‌‌కు చెందిన శ్రీదత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ పుష్కర స్నానం చేశారు. సరస్వతి నదికి కొబ్బరికాయ కొట్టి చీర, సారెలు సమర్పించారు. అనంతరం ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. ఆలయ ఈవో మహేశ్​ ఆయనకు శేష వస్త్రాలు అందజేశారు. బుధవారం హస్త నక్షత్రం సందర్భంగా మహా సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు. కాశీ పండితుల ఆధ్వర్యంలో నవరత్నమాల హారతి, త్రివేణి సంగమంలో తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది.