జైపూర్: మాధవి ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్

జైపూర్: మాధవి ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్
  •     యువతిని వేధించేలా నిందితుడిని ప్రోత్సహించిన అతడి తల్లి, అక్క

జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​మండలంలోని టేకుమట్లకు చెందిన యువతి గోషిక మాధవి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేశ్​తో పాటు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజను మంగళవారం జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు సీఐ నవీన్ కుమార్, ఎస్సై భూమేశ్ వివరాలు వెల్లడించారు. మాధవికి రెండేళ్ల క్రితం వెంకటేశ్​తో స్నేహం ఏర్పడింది. దాన్ని ప్రేమగా భావించిన వెంకటేశ్.. మాధవి వెంట పడ్డాడు. ఆమె తిరస్కరించినా పెండ్లి చేసుకోవాలని వేధించాడు. యువతిని వదలకుండా వేధిస్తే చివరకు పెండ్లి చేసుకుంటుందని వెంకటేశ్​ను తల్లి శంకరమ్మ, అక్క శైలజ ప్రోత్సహించారు. 

ఆ ముగ్గురూ కలిసి యువతి ఇంటికి వెళ్లి పెండ్లి చేయాలని కోరగా.. వారు నిరాకరించారు. అయితే పెండ్లి చేయకపోతే ఆమె పేరుతో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ నెల 10 గోదావరిఖనిలో మాధవిని కలసి మళ్లీ ఒత్తిడి చేసి, అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో మరుసటి రోజున పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఆ క్రమంలో నిందితుడి తల్లి, అక్క కలిసి వెంకటేశ్​కు ఏదైనా జరిగితే ఊరుకోమని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన మాధవి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.