సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుబడింది. ముంబై నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న కోటి 22 లక్షల 70 వేల రూపాయలను రైల్వే పోలీస్ (GRP) ,ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
మే 26న ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో... బొల్లారం, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ల మధ్య తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన 40 ఏళ్ల విజయ్ అంబాదాస్ గుప్తాగా గుర్తించారు. ముంబైలో కాంత జ్యువెలరీ నడిపే సంతోష్ సేథ్ అనే వ్యక్తి దగ్గర ఈ నగదు తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ కోటి 22 లక్షల 70 వేల రూపాయల హవాలా సొమ్మును... సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని 'బంటి' అనే జ్యువెలరీ వ్యాపారికి అప్పగించేందుకు తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ నగదు బదిలీ కోసం విజయ్‌కు ఐదు వేల రూపాయల కమిషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
