కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి...రిజర్వాయర్లను నింపి రైతులను ఆదుకోండి: హరీశ్ రావు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి...రిజర్వాయర్లను నింపి రైతులను ఆదుకోండి: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను  ఆన్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపాలని హరీశ్ రావు కోరారు. వీటి ద్వారా సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌‌లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతున్నాయని, మరోవైపు ప్రాజెక్టుల్లో నీటిని సకాలంలో నింపకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరిలో కూడా వరద నీరు అందుబాటులో ఉందన్నారు. దీంతో మిడ్ మానేరు నుంచి మోటార్లు ఆన్ చేసి నీటిని పంప్ చేయాలని కోరారు. లోయర్ మానేరు డ్యామ్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 6.9 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని తరలించి, ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని కోరారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.