బీఆర్ఎస్ దిమ్మెలు కూలిస్తే.. దిమ్మతిరిగే బదులిస్తం : హరీశ్రావు

బీఆర్ఎస్ దిమ్మెలు కూలిస్తే.. దిమ్మతిరిగే బదులిస్తం : హరీశ్రావు
  •     స్వయంగా సీఎం ఇలా పిలుపునివ్వడమంటే శాంతిభద్రతలను దెబ్బతీయడమే: హరీశ్​రావు
  •     రేవంత్​ విద్వేషాలను రెచ్చగొడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ జెండా దిమ్మెలను కాంగ్రెసోళ్లు కూలగొడితే.. దిమ్మతిరిగేలా బదులిస్తామని మాజీ మంత్రి హరీశ్​రావు హెచ్చరించారు. బీఆర్​ఎస్​ జెండా దిమ్మెలను కూల్చాలని సీఎం బహిరంగంగా పిలుపునివ్వడమంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమేనన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎటు పోయారని ప్రశ్నించారు. స్వయంగా సీఎం, శాంతి భద్రతలను కాపాడే హోం శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. 

రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలవుతున్నదా.. రేవంత్​ రాజ్యాంగం నడుస్తున్నదా? అని నిలదీశారు. ఖమ్మంలో సీఎం రేవంత్​ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. 

సీఎం రేవంత్​ది ముమ్మాటికీ ద్రోహ చరిత్ర అని, అడుగడుగునా వెన్నుపోట్లు, అబద్ధాలు తప్ప రేవంత్​ రాజకీయ ప్రస్థానంలో ఏమీ లేవని ఆరోపించారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్​ అని మండిపడ్డారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ అని ఫైర్ అయ్యారు. 

‘‘సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా , రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీని వంచిస్తున్నడు. బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్నడు. అవినీతి దాహం.. ప్రజాద్రోహం కలిపితే రేవంత్​ రెడ్డి. బీజేపీ సర్కార్​ను కాంగ్రెస్​ వ్యతిరేకిస్తుంటే.. రేవంత్​ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనక మతలబేంటి? పగలు రాహుల్​ జపం చేస్తూనే.. రాత్రి బీజేపీ, టీడీపీలతో దోస్తీ చేస్తున్నడు’’ అని ఆయన విమర్శించారు.