
సిద్దిపేట: హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అందాల పోటీల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కోసం రూ.4వేల కోట్లు ఖర్చు పెడుతారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు చెల్లిస్తారు. కానీ రైతులకు మాత్రం రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
సోమవారం (మే 26) సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో పండగ సాయన్న, కొరివి కృష్ణ స్వామి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. విగ్రహాల ఆవిష్కరించడమే కాకుండా.. ఆ మహానీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.
ALSO READ | Kavitha-KTR Row: వాట్ నెక్స్ట్.. కవితను బుజ్జగిస్తారా.. లేదంటే మందలిస్తారా..?
పండగ సాయన్న పేదల కోసం పోరాడి ప్రాణం వదిలారని.. కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం తుపాకీతో కాల్చుకొని మరణించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో చెరువులకు నీళ్ళు ఇచ్చి ముదిరాజ్లకి ఉపాధి కల్పించామని.. తద్వారా రాష్ట్రంలో చేపల పెంపకం బాగా పెరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదన్నారు. వేయి కోట్లతో కేసీఆర్ ముదిరాజ్ ఆదుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ వచ్చాక సగం జిల్లాల్లో చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పోయలేదని.. ఇప్పటి వరకు చేపల పెంపకం కోసం టెండర్లు కూడా పిలవడం లేదన్నారు. ముదిరాజ్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ ఏడాది అన్ని చెరువుల్లో చేప పిల్లలు పోయాలని.. లేదంటే కాంగ్రెస్ సర్కార్ ను వదిలేదే లేదని హెచ్చరించారు.