హైదరాబాద్: కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదని.. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిట్టు, లట్టు, పొట్టుకు మేం భయపడమని.. సిట్ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. మంగళవారం (జనవరి 20) ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాపై నిరాధార ఆరోపణలు చేశారని.. విచారణ పేరుతో సమయం వృధా చేశారని అన్నారు.
నోటీసులు వస్తే పారిపోమని.. ఎన్ని విచారణలు అయినా ఎదుర్కొంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమైక్య రాష్ట్రంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారని.. కేసులు, అరెస్టులు మాకు కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని.. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశాడని.. ఈ స్కామ్‌ను బట్టబయలు చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. దమ్ముంటే నన్ను విచారణ చేసినప్పుడు తీసిన వీడియో బైట పెట్టాలని.. అంతే కానీ చిల్లర లీకులు ఇవ్వొద్దని అన్నారు. ఇది లీకుల ప్రభుత్వం, స్కాముల ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు ముందే ఉన్నాయన్నారు.
