
క్రికెట్ లో ఒక చెత్త షాట్ మ్యాచ్ పై ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయం చాలా సార్లు రుజువైంది. అప్పటివరకు క్లిష్ట పరిస్థితిలో ఒత్తిడి తట్టుకొని ఆడి జట్టును విజయతీరాలకు తెచ్చిన ఆటగాళ్లు తన తప్పుడు షాట్ సెలక్షన్ తో ఔటయ్యి జట్టు ఓటమికి కారణమవుతారు. టీమిండియాతో ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమిని ఎవరూ ఊహించి ఉండరు. జట్టు అప్పటికే మూడు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తుంది. మరో 73 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
హ్యారీ బ్రూక్ (111) సెంచరీతో మ్యాచ్ ను పూర్తిగా ఇంగ్లాండ్ వైపుకు మళ్ళించాడు. రూట్ తో కలిసి నాలుగో వికెట్ కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు చెమటలు పట్టించాడు. సిరాజ్ క్యాచ్ మిస్ చేయడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ ఇంగ్లాండ్ యువ బ్యాటర్ వన్డే ఫార్మాట్ తరహాలో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రూక్ ఆట తీరుకు భారత ఆటగాళ్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే బ్రూక్ ఆడిన చెత్త షాట్ కారణంగా ఇంగ్లాండ్ పతనం ప్రారంభమైంది. ఆకాష్ దీప్ బౌలింగ్ లో ముందుకు వచ్చి ఒక లూజ్ షాట్ ఆడితే టైమింగ్ కుదరక కవర్స్ లో క్యాచ్ వచ్చింది.
బ్రూక్ వికెట్ భారత జట్టుకు ఫుల్ జోష్ ఇచ్చింది. టీ విరామం తర్వాత బెతేల్, రూట్ వికెట్లు పడ్డాయి. చివరి రోజు సిరాజ్ విజృంభించి ఇంగ్లాండ్ పరాజయానికి కారణమయ్యాడు. బ్రూక్ మంచి ఇన్నింగ్స్ ఆడినా అతని చెత్త షాట్ జట్టు ఓటమికి కారణమైంది. 1987 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇంగ్లాండ్ జట్టుకు ఇదే సీన్ జరిగింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఛేజింగ్ లో ఆరంభంలోనే ఓపెనర్ టిమ్ రాబిన్సన్ వికెట్ కోల్పోయినప్పటికీ.. గ్రాహం గూచ్ (35), బిల్ అథే (58) ఇంగ్లాండ్‌ను నిలబెట్టారు. కెప్టెన్ గాటింగ్ 45 బంతుల్లోనే 41 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 2 వికెట్లను 135 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
విజయం దిశగా వెళ్తున్న ఇంగ్లాండ్ ను కెప్టెన్ గాటింగ్ ఒక అనవసర షాట్ తో జట్టు ఓటమికి కారణమయ్యాడు. అలెన్ బోర్డర్ లాంటి పార్ట్ టైం బౌలర్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. వాస్తవానికి ఆ సమయంలో గాటింగ్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ చెత్త షాట్ ఆడి వికెట్ పోగొట్టుకోవడంతో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తాజాగా ఇండియాపై బ్రూక్ చెత్త షాట్ ఇంగ్లాండ్ ఓటమికి కారమైంది.