Vinesh Phogat: వారిచ్చేది ఏంటి.. మేం కొనిస్తాం..: వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడ‌ల్

Vinesh Phogat: వారిచ్చేది ఏంటి.. మేం కొనిస్తాం..: వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడ‌ల్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా దేశమంతటా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. తనపై పడిన అనర్హత వేటును సవాల్ చేస్తూ భారత రెజ్లర్.. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (Court of Arbitration for Sports‌) ఆశ్రయించింది. తనను ఉమ్మడి రజత(సిల్వర్) పతక విజేతగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరింది. దీనిపై ఆగస్టు 13న CAS తుది తీర్పు వెల్లడించనుంది. 

ప‌త‌కం సాధించకపోయినా స్వదేశంలో భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్‌కు భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. విశ్వ క్రీడ‌ల్లో ఆమె విశేషంగా రాణించడమే అందుకు కారణం. ఈ పోరాటాన్ని మెచ్చి వినేశ్ ఫోగాట్‌ స్వరాష్ట్రం హ‌ర్యానాకు చెంద‌ని ఖాప్ పంచాయ‌తీ (Khap Panchayat) సభ్యులు ఊహించని రివార్డు ప్ర‌క‌టించారు. ఆదివారం చర్కీ దాద్రిలో సాంగ్వాన్ ఖాప్ ఆధ్వర్యంలో అన్ని కులాల మహాపంచాయతీ నిర్వహించారు. ఇందులో రెజ్లర్ వినేట్ ఫోగాట్‌కు అనుకూలంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉత్తర భారతదేశంలోని ఖాప్‌లందరూ ఒక్కతాటిపైకి వచ్చి వినేష్ ఫోగట్‌ను బంగారు పతకంతో సత్కరిస్తారని అన్నారు. ఈ బంగారు పతకం ఒలింపిక్స్‌లో ఇచ్చే బంగారు పతకాన్ని పోలి ఉండనుంది. ఆమె పారిస్ నుంచి స్వ‌దేశానికి రాగానే ఈ స‌న్మాన కార్యక్రమం జరగనుంది.

భారత రత్న..

ఇదిలావుంటే, వినేశ్ ఫోగాట్‌కు భారత రత్న ఇవ్వాలని చర్కీ దాద్రి ప్రజలు డిమాండ్ చేశారు. అంతేకాదు, ఒలింపిక్స్‌లో వినేశ్‌ను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించ‌డం వెనుక కుట్ర దాగుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే, దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.