యుద్ధం నిజంగానే ముగిసిందా.. శాశ్వతంగా ముగిసిందా లేక తాత్కాలికమేనా.. 38 రోజుల యుద్ధంలో గెలిచింది ఎవరు.. ఓడింది ఎవరు.. ఈ యుద్ధంతో లాభపడింది ఎవరు.. నష్టపోయింది ఎవరు.. కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న స్వర్ణయుగం నిజంగా మొదలైందా.. కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ఏం చెప్పింది.. అమెరికా ఇచ్చిన హామీలు ఏంటీ.. అసలు యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేయబోతుంది.. చుట్టూ ఉన్న దేశాలపై ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకున్నదా.. కాల్పుల విరమణకు ముందు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన 10 కీలకమైన అంశాలు.. చర్చల సారాంశం ఇదే..
1. తాత్కాలిక కాల్పుల విరమణ
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదని.. కేవలం విరామం మాత్రమే అంటున్నాయి రెండు దేశాలు. పైగా ఈ సీజ్ ఫైర్ షరతులతో కూడుకున్నదని.. ఏ క్షణానైనా ఒప్పందం ఉల్లంఘించే అవకాశం ఉంది. ఈ చర్య యుద్ధం ముగింపును సూచించదని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కూడా స్పష్టం చేసింది. ఇది శత్రుత్వాన్ని పూర్తిగా అంతం చేయడానికి కాకుండా, చర్చలకు వీలు కల్పించే లక్ష్యంతో తీసుకున్న ఒక వ్యూహాత్మక విరామం మాత్రమేనని పునరుద్ఘాటించింది.
2. కాల్పుల విరమణలో హెూర్ముజ్ జలసంధి కీ రోల్
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో స్ట్రైయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి కీ రోల్ ప్లే చేసింది. తక్షణమే హార్మూజ్ జలసంధిని తెరవాలనేది అమెరికా ప్రధాన డిమాండ్. దీనికి ఇరాన్ అంగీకరించింది. హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని సూత్రప్రాయంగా ఒప్పుకుంది. కాకపోతే ఇరాన్ ఒక కండీషన్ పెట్టింది. ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలోనే హార్మూజ్‌లో రవాణాకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.
3. అమెరికా యాక్షన్ భట్టే మా రియాక్షన్: ఇరాన్
కాల్పులు విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ సైనిక కార్యకలాపాలను బేషరతుగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించలేదు. ఇరాన్‌పై అమెరికా దాడులు నిలిపివేస్తేనే.. మా దళాలు చర్యలను ఉపక్రమించుకుంటాయని స్పష్టం చేసింది ఇరాన్. అమెరికా ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఒప్పందం వెంటనే బ్రేక్ అవుతోందని తేల్చి చెప్పింది. అమెరికా యాక్షన్ భట్టే మా రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.
4. ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రత్యక్ష చర్చలు
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనల మేరకు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 2026, ఏప్రిల్ 10న అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ధృవీకరించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనుండటం ఇదే తొలిసారి.
5. ఇరాన్ 10 కండీషన్లు
యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ముందు ఇరాన్ 10 ప్రతిపాదనలు పెట్టింది.
ఇరాన్ కాల్పుల విరమణ షరతులు ఇవే..
ఇరాక్, లెబనాన్ ,యెమెన్‌లపై యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడం
ఇరాన్‌పై యుద్ధానికి సంపూర్ణ ,శాశ్వత విరమణ ప్రకటించాలి
ఈ ప్రాంతంలోని అన్ని దాడులను పూర్తిగా నిలిపివేయాలి
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం
హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ ,భద్రతకు కొన్ని నియమాలు, షరతులను ఏర్పాటు చేయడం
ఇరాన్‌కు పునర్నిర్మాణ ఖర్చుల పూర్తి పరిహారం చెల్లించాలి
ఇరాన్‌పై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయాలి
అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ నిధులు,ఆస్తులు విడుదల చేయాలి
ఎలాంటి అణ్వాయుధాలను తయారు చేయమని ఇరాన్ స్పష్టీకరణ
పై షరతులకు ఆమోదం లభించిన వెంటనే తక్షణ కాల్పుల విరమణ అమలు
6. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన ఆగని దాడులు
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పశ్చిమాసియాలో దాడులు ఆగలేదు. గల్ఫ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఖతార్, యూఏఈ వంటి దేశాల్లో మిస్సైళ్లు, డ్రోన్లు దూసుకెళ్తున్నాయి. ఇరాన్ నుంచి క్షిపణులు వస్తున్నాయంటూ ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది. ఈ పరిణామం కాల్పుల విరమణ కుదిరిన క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టం చేస్తోంది.
7. కాల్పుల విరమణ అమెరికా విజయం: ట్రంప్
కాల్పుల విమరణ ఒప్పందాన్ని అమెరికా విజయంగా అభివర్ణించారు ట్రంప్. చర్చలు ఇప్పటికే ఉన్నత దశలో ఉన్నాయని.. గతంలోని వివిధ వివాదాంశాలలో దాదాపు అన్నింటికీ అంగీకారం కుదిరిందని తెలిపారు. ఇరాన్ ప్రపోజల్ కూడా ఆచరణీయమైనదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. దీంతో ఇరాన్ కండీషన్లపై ట్రంప్ సానూకూలంగా ఉన్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు సఫలమై యుద్ధం ఆగొచ్చంటున్నారు నిపుణులు.
8. ఇరాన్ సైనిక కమాండ్ వ్యవస్థ ప్రాబ్లమ్
సీజ్ ఫైర్ కుదిరినప్పటికీ ఇరాన్ వికేంద్రీకృత సైనిక కమాండ్ వ్యవస్థ కారణంగా కాల్పుల విరమణ ఆదేశాలు తక్షణమే అమలు కాకపోవచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్ అన్ని యూనిట్లను కాల్పులు ఆపమని ఆదేశించారని ప్రభుత్వ మీడియా నివేదించినప్పటికీ.. ఇరాన్ సైనిక కమాండ్ వ్యవస్థ ప్రాంతీయ కమాండర్లకు కొంతమేర స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది. దీని వల్ల సుప్రీం లీడర్ ఆదేశాలను పాటించడంలో ఆలస్యం కావచ్చు.. కొన్నిసార్లు ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారం కూడా ఉంది.
10. యుద్ధం వల్ల అమెరికా సాధించింది ఏంటి..?
ఈ యుద్ధం వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధించింది ఏమి లేదు. అణు కార్యక్రమం పూర్తిగా ఆపేయడానికి ఇరాన్ అంగీకరించలేదు. ఈ యుద్ధానికి ముందు హార్మూజ్ జల సంధి గుండా చమురు రవాణా సాఫీగా సాగేది. కానీ వార్ స్టార్ట్ అయ్యాక హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సాధించింది. ఇప్పుడు హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా జరగాలంటే మాకు పన్ను చెల్లించాలని ఇరాన్ షరతు విధించింది. గతిలేని పరిస్థితుల్లో అమెరికా ఈ షరతు ఒప్పుకోవాల్సి ఉంటుంది.
దౌత్యపరమైన అవకాశాలు తెరుచుకున్నప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ప్రభావం, దీర్ఘకాలంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కీలక వివాదాలు పరిష్కారం కాలేదు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఉద్రిక్తతలను గణనీయంగా తగ్గించడమే అయినప్పటికీ, ఇది సంఘర్షణకు పూర్తి ముగింపు కాదు.
సీజ్ ఫైర్ షరతులతో కూడి ఉండటం, మిడిల్ ఈస్ట్‌లో దాడులు ఇంకా కొనసాగుతుండటం, ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పరిస్థితి అస్థిరంగానే ఉంది. ఈ క్రమంలో ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన ఈ తాత్కాలిక విరామం శాశ్వత ఒప్పందంగా మారుతుందా లేకపోతే యుద్ధంలో ఇది ఒక తాత్కాలిక అంతరాయంగానే మిగిలిపోతుందా అనేది కాలమే సమాధానం చెబుతోంది.
