కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతాబెనర్జీ గద్దె దించాల్సిందేనని, లేదంటే బంగ్లాదేశీ ముస్లింలు రాష్ట్రాన్ని లాగేసుకుంటారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ధ్వజమెత్తారు. శనివారం కాలింపాంగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. మమత బెంగాల్ ఖజానా మొత్తాన్ని బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల కోసం కేటాయించారని, ఓట్ల కోసం ఈ భూమిని వారికి అమ్మేశారని ఆరోపించారు. మమత హయాంలో బెంగాల్ పూర్తిగా నాశనమైందని విమర్శించారు.
అస్సాం, త్రిపురల్లో బీజేపీ ప్రభుత్వాలు బంగ్లాదేశీ ముస్లింల చొరబాట్లను అడ్డుకున్నాయని, బెంగాల్‌లో ఈ సమస్య ఇంకా కొనసాగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బెంగాల్ నుంచి చొరబాటుదారులను బయటకు గెంటివేస్తామని తెలిపారు. గూర్ఖాలాండ్ సమస్యకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాన్ని కనుగొని, గూర్ఖాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మమత హయాంలో ఉత్తర బెంగాల్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కాగా, మమతా బెనర్జీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న టీఎంసీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

