
హైదరాబాద్: సిటీ శివారులో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద నీరు ఇళ్లలోకి రావడంతో నానా తంటాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హయత్ నగర్లోని బంజార కాలనీలలో మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఇండ్లలోకి వరద నీరు చేరి ఇంట్లో సామాన్లు తడిసి ముద్దయ్యాయి. బట్టలు, బియ్యం తడిసి పోయాయి. ఇంట్లోకి నీళ్లు రావడంతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది బంజారా కాలనీలో సహయక చర్యలు చేపట్టారు.
తుర్కయంజాల్లోని మాసబ్ చెరువు నుంచి ఇంజాపూర్ సమీపంలోని జిలాన్ ఖాన్ చెరువుకు భారీగా వరద పొటెత్తింది. ఈ క్రమంలో జిలాన్ ఖాన్ చెరువు నిండటంతో ఆ వరద నీరు బంజార కాలనీని ముంచెత్తిందని స్థానికులు తెలిపారు. జిలాన్ ఖాన్ చెరువు నుంచి వరద నీరు పెద్దఅంబర్ పేట్ చెరువుకు వెళ్లాల్సి ఉండగా.. నాలుగేళ్ల క్రితం ఇక్కడ ఎలాంటి ప్రణాళిక లేకుండా చేపట్టిన డ్రైనేజీ లీక్ కావడంతో జిలాన్ ఖాన్ చెరువు నుండి వచ్చే వరద నీరు బంజారా కాలనీలోకి చేరి కాలనీని ముంచెత్తిందని చెప్పారు స్థానికులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని.. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కాలనీలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.
నీట మునిగిన హయత్ నగర్లోని బంజారాకాలనీ పరిస్ధితిని సోమవారం (సెప్టెంబర్ 22) ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. కాలనీలోకి వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి.. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.