జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం

జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని HCA అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సూచనలను పాటిస్తామన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తుండడంతో టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారని అన్నారు. క్రికెట్ కు పెద్ద ఎత్తున ఆదరణ ఉండడంతోనే  టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ వచ్చిందన్నారు. ఇప్పటికే టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయని చెప్పారు. ఈ నెల 25వ తేదీన భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తామన్నారు. జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారికి HCA పూర్తిగా వైద్య ఖర్చులను భరిస్తుందని స్పష్టం చేశారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లను అమ్ముతామనే విషయాన్ని ముందుగానే పోలీసులకు తెలియజేశామని చెప్పారు. శాంతిభద్రతల అంశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే... 
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం విషయంలో HCA.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే సంప్రదించి ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత HCA తేరుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు కోరింది కాబట్టి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కొంతమంది కావాలనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారని, అలాచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జింఖానా గ్రౌండ్ లో గాయపడ్డవారికి అయ్యే వైద్య చికిత్స ఖర్చులను HCA భరిస్తుందని చెప్పారు. మ్యాచ్ నిర్వహణ కోసం.. అన్ని ప్రభుత్వ శాఖలను కో ఆర్డినేట్ చేసేందుకు.. ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశామని తెలిపారు. టిక్కెట్ల గోల్ మాల్, ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. 

క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాల సమయంలో తలెత్తిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో యువకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని, అనుకోకుండా తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. HCA నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈ నెల 25వ తేదీన భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. HCA ఎలాంటి కార్యక్రమం చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉంటుందన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం వ్యవహారంలో హెచ్సీఏ తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, స్పోర్ట్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయాతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.