హెచ్‌‌‌‌సీయూకు తొలి మహిళా వీసీ..ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ జె. అనురాధ

హెచ్‌‌‌‌సీయూకు తొలి మహిళా వీసీ..ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ జె. అనురాధ
  •     పదవీ విరమణ చేసిన  వీసీ ప్రొఫెసర్ బీజే రావు  

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌‌‌‌సీయూ) ఇన్‌‌‌‌చార్జి వైస్ ఛాన్సలర్‌‌‌‌గా సీనియర్ ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ నియమితులయ్యారు. ఇప్పటివరకు వీసీగా కొనసాగిన ప్రొఫెసర్ బీజే రావు పదవీకాలం ఈ నెల 12తో ముగియడంతో, వర్సిటీ నిబంధనల ప్రకారం సీనియర్ ప్రొఫెసర్‌‌‌‌గా ఉన్న అనురాధ బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ చరిత్రలోనే వీసీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ప్రొఫెసర్ అనురాధ రికార్డు సృష్టించారు. ఆమెకు ఈ విశ్వవిద్యాలయంతో మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.

ఇదే యూనివర్సిటీలో కూచిపూడిలో పీజీ, పీహెచ్‌‌‌‌డీ పూర్తి చేశారు. 1993లో ఫ్యాకల్టీగా చేరిన ఆమె అకడమిక్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత బాధ్యతలకు ముందు సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ డీన్‌‌‌‌గా, డ్యాన్స్ విభాగం హెడ్‌‌‌‌గా సేవలందించారు. అకడమిక్ రంగంతో పాటు ప్రసిద్ధ కూచిపూడి నృత్య కళాకారిణిగా కూడా ప్రొఫెసర్ అనురాధ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.