- నిక్కీ యాదవ్ మర్డర్ కేసులో కీలక విషయం వెలుగులోకి..
- సాహిల్‌కు సహకరించిన తండ్రి, సోదరులు, ఫ్రెండ్స్ కూడా అరెస్ట్ '
న్యూఢిల్లీ: వెస్ట్ ఢిల్లీ పరిధిలోని మిత్రావ్ గ్రామంలో నిక్కీ యాదవ్ (23)ను ఆమె బాయ్ ఫ్రెండ్ సాహిల్ గెహ్లాట్ (24) హత్య చేసి ఫ్రిడ్జ్ లో దాచిన కేసు కీలక మలుపు తిరిగింది. నిక్కీ యాదవ్, సాహిల్ ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని అంతా భావించగా.. వాళ్లిద్దరికీ రెండేండ్ల కిందటే ఆర్యసమాజ్ లో పెండ్లి అయిందని తాజాగా పోలీసుల విచారణలో వెల్లడైంది. నిక్కీకి తెలియకుండా మరో యువతిని ఈ నెల 10న పెండ్లి చేసుకునేందుకు సాహిల్ సిద్ధపడగా, ఈ విషయంలో గొడవ జరగడంతో ఆమెను మొబైల్ ఫోన్ చార్జింగ్ కేబుల్ ను గొంతుకు బిగించి మర్డర్ చేసినట్లు తేలింది. హత్య చేసి, డెడ్ బాడీని తమ ధాబాలోని ఫ్రిడ్జ్ లో దాచిన సాహిల్.. అక్కడి నుంచి నేరుగా పెండ్లి మండపానికి పోయినట్లు వెల్లడైంది. నిక్కీ హత్యకు జరిగిన కుట్రలో, డెడ్ బాడీని దాచడంలో, ఆధారాలను నాశనం చేయడంలో సాహిల్ కు అతని తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, ఫ్రెండ్స్ లోకేశ్, అమర్ సహకరించారని, వారిని కూడా శుక్రవారమే అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.
2020 అక్టోబర్ లోనే పెండ్లి..
హర్యానాలోని ఝజ్ఝర్ గ్రామానికి చెందిన నిక్కీ, వెస్ట్ ఢిల్లీలోని మిత్రావ్ గ్రామానికి చెందిన సాహిల్ పెద్దలకు తెలియకుండా నోయిడాలోని ఆర్య సమాజ్ లో 2020 అక్టోబర్ లో పెండ్లి చేసుకున్నారు. వీరి మ్యారేజ్ సర్టిఫికెట్, పెండ్లి ఫొటోలను పోలీసులు సేకరించారు. నిక్కీని సాహిల్ కుటుంబం అంగీకరించకపోవడంతో, ఆమెకు తెలియకుండా మరో యువతితో పెండ్లికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసి పెండ్లి రోజే నిక్కీ గొడవ చేయడంతో ఆమెను సాహిల్ హత్య చేశాడు. నిక్కీ కనిపించడంలేదని పొరుగింటి యువతి కంప్లయింట్ చేయడంతో పోలీసులు సాహిల్ ను విచారించగా, ఈ నెల 14న హత్య విషయం బయటపడింది. అయితే, నిక్కీ, సాహిల్ పెండ్లి విషయం తమకు తెలియదని ఆమె తండ్రి సునీల్ యాదవ్ వెల్లడించారు. సాహిల్ కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిక్కీతో పెండ్లి, హత్య విషయం తెలియక ఈ నెల 10న సాహిల్ ను పెండ్లి చేసుకున్న యువతి తన పుట్టింటికి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
