
అతడు నిరుపేద కుటుంబంలో పుట్టి క్రీడా ప్రపంచాన్నే జయించిన రారాజు..
అతడు ఫుట్‌బాల్‌ను ప్రపంచం ఆరాధించే ఆటగా మార్చిన మొనగాడు..
అతడు కల్లోల దేశాన్ని సాకర్ మైకంలో పడేసిన మాంత్రికుడు...
తన ఆటతో దేశ రాతనే మార్చేసిన రాజనీతిజ్ఞుడు..!
మైదానంలో అత్యద్భుత నైపుణ్యాలతో.. బయట తన అసాధారణ వ్యక్తిత్వంతో.. ఏడు దశాబ్దాల పాటు ఫుట్‌బాల్‌కు పర్యాయపదంలా మారిన బ్రెజిల్ సాకర్ లెజెండ్ పీలే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.! క్యాన్సర్‌తో పోరాడుతూ 82 ఏండ్ల వయసులో కన్నుమూసిన పీలే అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తాడు.! బ్రెజిల్ తరఫున మూడు వరల్డ్ కప్స్ సాధించిన ఆటగాడిగా..
సాకర్ సామ్రాజ్యంలో గ్రేటెస్ట్ ప్లేయర్‌గా ఎదిగిన పీలే ఈ లోకానికి దూరమైనా.. ఆటపై అతని ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు.!
ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్ మనుగడ ఉన్నంత కాలం పీలే పేరు నిలిచిపోతుంది..!
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: క్రీడా ప్రపంచంలో బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీని అతి గొప్ప క్రీడాకారుడు అంటారు. పీలే కూడా అలీ సరిసమానుడే కాదు అంతకుమించినవాడు. బాక్సింగ్‌కు అలీ ఎలా వన్నే తెచ్చాడో సాకర్‌కు అంతకుమించి సాధించిపెట్టాడు పీలే. ఎర్రమట్టి టెన్నిస్ కోర్టులో రఫెల్ నడాల్ ఏ రేంజ్‌లో విజృంభిస్తాడో.. బీజింగ్, లండన్ రియో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ ట్రాక్‌పై ఉసేన్ బోల్ట్, ఈత కొలనులో మైకేల్ పెల్ఫ్స్ పతకాల మోతతో క్రీడా ప్రపంచాన్ని ఎలా విస్మయపరిచారో.. తన కెరీర్ ఆసాంతం పీలే సాకర్ ఫ్యాన్స్‌ను అలానే ఉర్రూతలూగించాడు.
బ్రెజిల్‌కు మూడు వరల్డ్‌కప్ టైటిల్స్ అందించి, 1200కి పైగా గోల్స్ కొట్టి ఒక తరం పాటు ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని ఏలాడు. అందులో 784 గోల్స్‌ని మాత్రమే ఫిఫా గుర్తించింది. అయినా పీలే టాలెంట్‌ను గోల్స్‌తో, రికార్డులతో కొలవలేం. తను తొలి స్పోర్టింగ్ సూపర్ స్టార్. ఖండాలను దాటొచ్చి, హద్దులను చెరిపేసి.. ఫుట్‌బాల్‌ను విశ్వక్రీడగా చేసిన అంబాసిడర్. తన ఆటతో ప్రపంచం నలుమూలలా అభిమానులను, ఆరాధ్యులనుసంపాదించుకున్న మెజీషియన్.
కల్లోల దేశంలో పుట్టి..
1950ల్లో వరల్డ్‌కప్స్‌ను టీవీల్లో ప్రసారం చేసినప్పటి నుంచి ఫుట్‌బాల్ కమర్షియల్ స్పోర్ట్స్‌గా మారడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా సహా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో తన అత్యద్భుత స్కిల్స్‌తో సాకర్ ఫ్యాన్స్‌ను విస్మయపరుస్తూ.. ఈ ఆటను ఆరాధించేలా చేశాడు. బ్రెజిల్ అవినీతి, సైనిక తిరుగుబాట్లు, అణచివేత, తిరోగమన ప్రభుత్వాలతో పోరాడుతున్న సమయంలో జన్మించిన పీలే తన ఆటతో ఆ దేశ రాత మార్చాడు. 17 ఏండ్ల వయసులో బ్రెజిల్ తరఫున యంగెస్ట్ ప్లేయర్‌గా 1958లో తన మొట్టమొదటి ప్రపంచ కప్‌లో పాల్గొని.. అద్భుతమైన పెర్ఫామెన్స్ చేశాడు. అంతే.. అప్పటిదాకా అనిశ్చితి, అసంతృప్తితో ఉన్న బ్రెజిల్ జనాలు పీలే మాయలో పడిపోయారు.
అక్కడి నుంచి బ్రెజిల్ ప్రతిష్ఠ మారిపోయింది. స్వీడన్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో పీలే నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్ కొట్టాడు. స్వీడన్‌పై ఫైనల్లో రెండు గోల్స్ సాధించి బ్రెజిల్‌ను 5-–2తో గెలిపించడంతో పీలే పేరు ఆ దేశంలోనే కాదు ప్రపంచమంతటా మార్మోగింది. ఆ కప్పుతో బ్రెజిల్ పూర్తిగా పీలే, సాకర్ మాయలో పడిపోయింది. అక్కడి నుంచి ఒకటిన్నర దశాబ్దం పాటు పీలే, బ్రెజిల్, ఫుట్‌బాల్.. ఈ మూడు పేర్లు వరల్డ్ వైడ్ రీసౌండ్‌తో వినిపించాయి.
గ్రేటెస్ట్ ప్లేయర్‌గా ఎదిగి..
పీలే గొప్ప ఆటగాడు. ఈ మాట ఎవరో చెప్పలేదు. వరల్డ్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫానే అతడిని గ్రేటెస్ట్ అని ప్రకటించింది. ఎప్పుడూ నవ్వుతూ, శాంత స్వభావుడిలా కనిపించే పీలే.. గ్రౌండ్లోకి రాగానే చిరుతలా పంజా విసురుతాడు. 1962 రెండో సారి ప్రపంచ కప్పును ముద్దాడిన పీలే 1970లో నాయకుడిగా మూడో కప్పు అందుకున్నాడు. దాంతో, వ్యక్తిగతంగా పీలేనే కాకుండా ఓ నల్లజాతీయుడు ప్రపంచ హీరోగా మారడంతో ఆ వర్గం వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బ్రెజిల్ స్పోర్ట్స్ మినిస్టర్‌గానే కాకుండా ఏదో రూపంలో ఆటకు సేవ చేశాడు. ఈ మధ్యే మెస్సీ ఎట్టకేలకు వరల్డ్‌కప్ అందుకోవడంతో అందరూ తనను గ్రేటెస్ట్ ప్లేయర్ అంటూ పొగిడేస్తున్నారు. మరి, ఏకంగా మూడు వరల్డ్ కప్స్ నెగ్గిన పీలేను ఏమని పొగడాలి? పీలేను ఎవ్వరితో పోల్చిచూడలేం. అతనికి ఎవ్వరూ సాటిరారు.
అవన్నీ అప్పుడే..
క్రిస్టియానో రొనాల్డో కొట్టే బైసికిల్ కిక్, హెడర్స్.. మారడోనా, మెస్సీ, నెయ్‌మార్ డ్రిబ్లింగ్‌తో చేసే మాయాజాలం, మరికొందరు స్టార్లు దూరం నుంచి ఫ్రీ కిక్‌ను నెట్‌లోకి కొట్టడం చూసి ఫిదా అయ్యాం. కానీ, ఈ షాట్లన్నీ పీలే ఏనాడో ఆడేశాడు. పై అందరిలో ఉన్న స్పీడ్, స్టామినా, టాలెంట్, స్కిల్స్ పీలే సొంతం. జీవితం మొత్తం మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉన్న బ్రెజిల్ లెజెండ్ కెరీర్ ఆరంభం నుంచి చివరి వరకు ఫీల్డ్‌లో ఫిట్‌గా ఉన్నాడు. చిరుత వేగంతో పరుగెడుతూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను ఏమారుస్తూ గోల్స్ సాధించాడు.
ఒరిగిన శిఖరం
ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్న సమయంలో బ్రెజిల్ లెజెండరీ ప్లేయర్ పీలే గురువారం అర్ధరాత్రి కన్నుమూశాడు. పెద్ద పేగు క్యాన్సర్ కు తోడు ఇతర అవయవాలు పనిచేయకపోవడంతో 82 ఏండ్ల పీలే సావోపాలోలోని ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 21 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో మూడు వరల్డ్ కప్స్ నెగ్గిన పీలే.. ఓవరాల్‌గా 1363 మ్యాచ్‌లాడి రికార్డు స్థాయిలో 1281 గోల్స్ చేశారు. ఇందులో బ్రెజిల్ నేషనల్ టీమ్ తరఫున 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ కొట్టాడు. 2000 సంవత్సరంలో పీలేను ఫిఫా ఈ శతాబ్దపు బెస్ట్ప్లేయర్గా ప్రకటించింది. కాగా, ప్రజల సందర్శనార్థం పీలే మృతదేహాన్ని సోమ, మంగళవారాల్లో సావోపాలోలోని విలా బెల్మెరియాలో స్టేడియంలో ఉంచుతారు. అనంతరం శాంటోస్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
శాంటోస్‌తో మొదలై..
పీలే అసలు పేరు ఎడిసన్ అరాంట్స్ డో నాసిమియాంటో. సావో పాలోలో నిరు పేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి డాండినో పార్ట్‌టైమ్ ఫుట్‌బాలర్ కావడంతో పీలేకు చిన్నప్పటి నుంచే సాకర్‌పై ఆసక్తి పెరిగింది. స్కూల్ లెవెల్లో మొదట గోల్ కీపింగ్‌పై ఇష్టం చూపెట్టినా తర్వాత మిడ్‌ఫీల్డర్‌గా, ఫార్వర్డ్‌గా మారాడు. 14 ఏండ్లు వచ్చేసరికి.. మెరుపు వేగంతో బాల్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపిన అతని టాలెంట్ మెచ్చి ఓ లోకల్ క్లబ్ అవకాశం ఇచ్చింది. అయితే, 1956లో పీలే హోమ్‌టౌన్‌కు చెందిన ప్రొఫెషనల్ క్లబ్ శాంటోస్ చాన్స్ ఇవ్వడంతో అతని కెరీర్ టర్న్ అయ్యింది.
నాటి నుంచి 1974లో శాంటోస్‌ను విడిచే వరకు పీలే ఆ క్లబ్ తరఫున 636 మ్యాచ్‌లు ఆడి 618 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో చేరిన వెంటనే బ్రెజిల్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. 1957లో అర్జెంటీనాపై తొలి మ్యాచ్ ఆడి 16 ఏండ్లకే ఇంటర్నేషనల్ గోల్ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా పీలే నెలకొల్పిన రికార్డు 65 ఏండ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అక్కడ మొదలైన పీలే జైత్రయాత్ర 1971లో యుగోస్లేవియాతో చివరి ఇంటర్నేషనల్ ఆడే వరకు కొనసాగింది. నేషనల్ టీమ్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత న్యూయార్క్ కాస్మోస్ క్లబ్ తరపున రెండేళ్లు అలరించాడు.
కొన్ని వివాదాలూ
ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పీలేను కొన్ని వివాదాలూ చుట్టుముట్టాయి. అతని వైవాహిక జీవితంసాఫీగాసాగలేదు.తను ముగ్గురిని పెళ్లి చేసున్నాడు. అదే సమయంలో పలువురు మహిళలతో సంబంధాలు కొనసాగించాడన్న విమర్శలు వచ్చాయి. 1995-–-1998లో పీలే బ్రెజిల్ స్పోర్ట్స్ మినిస్టర్ గా వ్యవహరించాడు. స్పోర్ట్స్‌లో చాలా సంస్కరణలు చేపట్టి, అవినీతి తగ్గించే ప్రయత్నం చేసినా.. మూడేళ్లలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కోల్‌కతా మురిసిన వేళ
పీలేకు ఇండియాతో కూడా మంచి అనుబంధం ఉంది. తను మూడుసార్లు ఇండియా పర్యటనకు వచ్చాడు. 1977లో ఆసియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్‌ను ఎంతగానో ఇష్టపడే కోల్‌కతాలో పీలే అడుగు పెట్టాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 24న మోహన్ బగాన్ క్లబ్.. పీలే ఆడుతున్న క్లబ్ న్యూయార్క్ కాస్మోస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. నాడు ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో బగాన్, న్యూయార్క్ కాస్మోస్ మధ్య మ్యాచ్‌లో పీలే దాదాపు అరగంట పాటు ఆడాడు. అప్పటికి కెరీర్ చరమాంకంలో ఉన్న పీలే తన బెస్ట్ పెర్ఫామెన్స్‌కు ఇవ్వలేకపోతున్నా.. తనని చూసేందుకు ఏకంగా 80 వేల మంది స్టేడియానికి పోటెత్తారు.
ఆ మ్యాచ్‌లో మోహన్ బగన్ క్లబ్ మళ్లీ పాపులర్ అయ్యింది. ఇక, 2015లో రెండోసారి ఇండియాకు వచ్చిన బ్రెజిల్ లెజెండ్.. ఢిల్లీలో స్కూల్ పిల్లలతో కలిసి ఫుట్‌బాల్‌ను ఆస్వాదించాడు. సుబ్రతో కప్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్‌అండర్-17 ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన తను ఫ్యాన్స్, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాడు. ‘ఇండియా చిన్నారులతో కలిసి ప్రపంచంలోనే గొప్ప క్రీడను ఆస్వాదించడం నాకు గర్వకారణం’ అని చెప్పాడు. అదే ఏడాది కోల్‌కతాలో ఐఎస్‌ఎల్ మ్యాచ్‌ను ప్రారంభించిన పీలే.. 2018లో మరోసారి కోల్‌కతాతో పాటు ఢిల్లీకి వచ్చి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యుద్ధం ఆపేసి.. పీలే ఆట చూసి
1960ల్లో పీలే తన ఆటతో బ్రెజిల్‌నే కాదు ప్రపంచాన్నే తన వైపునకు తిప్పుకున్నాడు. తన ఆటతో యుద్ధాన్ని సైతం ఆపేలా చేశాడు. పీలే ఆడిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ చూసేందుకు 1969లో నైజీరియాలో అంతర్యుద్ధం సమయంలో పోరాడుతున్న రెండు వర్గాలు 48 గంటల పాటు కాల్పుల విరమణను ప్రకటించాయి.
మారడోనాతో దోస్తీ
ఫుట్ బాల్ ఆల్ టైమ్స్ గ్రేట్స్ లో ముందుండే పీలే, మారడోనా తమ దేశాల తరఫున మైదానంలో ఢీ అంటే ఢీ అన్నా.. బయట మాత్రం ఇద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారు. ఇద్దరి జెర్సీ నంబర్లు (10) ఒకటే కావడం విశేషం. రెండేళ్ల కిందట మారడోనా చనిపోయినప్పుడు పీలే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఒక రోజు మనమిద్దరం ఆకాశంలో ఫుట్ బాల్ ఆడుతాం‘ అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్ స్వర్గంలో ఆడుకుంటారని ఫ్యాన్స్ అంటున్నారు.
పీలే మరణం క్రీడా ప్రపంచంలో ఓ శూన్యతను మిగిల్చింది. ఆయనకు ఉన్న జనాదరణ హద్దులను చెరిపేసింది. తన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. - ప్రధాని నరేంద్ర మోడీ
పీలేకు ముందు ‘10’ కేవలం ఓ నంబర్ మాత్రమే. ఫుట్‌బాల్ ఒక స్పోర్ట్ మాత్రమే. కానీ పీలే.. ఫుట్‌బాల్‌ను ఓ కళగా, ఎంటర్టైన్మెంట్గా మార్చేశాడు. పేదలకు, నల్లజాతీయులకు, బ్రెజిల్‌కు ఓ గుర్తింపును ఇచ్చాడు. -నెయ్‌మార్
బ్రెజిల్, పీలే ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి. ఎంతో మందికి మీరు స్ఫూర్తిగా నిలిచారు. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. -రొనాల్డో
ఫుట్‌బాల్‌కే కాకుండా వరల్డ్ స్పోర్ట్స్‌కు పీలే మరణం ఓ తీరని లోటు. మీ వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ‘రెస్ట్ ఇన్ పీస్’ పీలే. - సచిన్
ఫుట్‌బాల్‌కు పీలే నిజమైన రాజు. మా అందరికి దేవుడు. గొప్ప ప్లేయరే కాకుండా అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ కూడా. ఆన్, ఆఫ్ ద ఫీల్డ్‌లో గొప్ప రోల్ మోడల్. -బైచంగ్ భుటియా