జీఎం పోస్టు రాకుండా అడ్డుకున్నడని.. తుపాకీతో కాల్చి చంపిండు

జీఎం పోస్టు రాకుండా అడ్డుకున్నడని.. తుపాకీతో కాల్చి చంపిండు
  • సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్ పై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి అరెస్ట్
  • కంట్రీమేడ్​ పిస్టల్​ స్వాధీనం


గచ్చిబౌలి, వెలుగు: మియాపూర్ సందర్శిని ఎలైట్ హోటల్ జనరల్ మేనేజర్ దేవేందర్​పై కాల్పులు జరిపి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోటల్​లో తనకు జీఎం పోస్టు రాకుండా దేవేందర్ అడ్డుకున్నాడనే కక్షతో.. మాజీ ఉద్యోగే కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు.ఈ కేసు వివరాలను మాదాపూర్​ జోన్ డీసీపీ సందీప్​ గురువారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో వెల్లడించారు. 

వెస్ట్​ బెంగాల్​లోని శిఖర్​బాలి గ్రామానికి చెందిన దేవేందర్​గయాన్​(35), ప్రియాంక దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి పదేండ్ల కిందట సిటీకి వచ్చారు. కొంపల్లి పరిధి సుచిత్ర వెంకటేశ్వరకాలనీలో ఉంటున్నారు. దేవేందర్ సిటీలోని పలు హోటల్స్ పనిచేసి..  9 నెలల కిందట మియాపూర్​లోని సందర్శిని ఎలైట్ హోటల్​లో మేనేజర్​గా జాయిన్ అయ్యాడు. కేరళలోని పెరుముడియార్ ముత్తుతల ప్రాంతానికి చెందిన రతీశ్ నాయర్(42) సైతం ఇదే రెస్టారెంట్​లో మేనేజర్​గా పనిచేస్తూ చందానగర్​పరిధి వేంకుంటలో ఉంటున్నాడు.

జీఎం పోస్టు కోసం మొదలైన గొడవ..

హోటల్​లో జనరల్ మేనేజర్ పోస్టు కోసం దేవేందర్, రతీశ్ నాయర్ మధ్య  పోటీ ఉండేది. దీంతో ఇద్దరూ అప్పుడప్పుడు గొడవ పడేవారు. దేవేందర్​ బాగా పని చేయడంతో పాటు హోటల్ ఓనర్​కు దగ్గరగా ఉండటంతో జనరల్ మేనేజర్ పోస్టు అతడికే దక్కింది. దీంతో రతీశ్..​ దేవేందర్​పై కక్ష పెంచుకున్నాడు. రతీశ్ పనితీరు నచ్చక హోటల్ ఓనర్ అతడిని నెలన్నర కిందట ఉద్యోగంలో నుంచి తొలగించాడు. దీంతో అతడు దేవేందర్​పై మరింత కోపం పెంచుకున్నాడు. 

తనకు జీఎం పోస్టు రాకపోవడానికి, జాబ్ పోవడానికి దేవేందర్  కారణమని భావించి.. అతడిని చంపేందుకు స్కెచ్ వేశాడు. ఈ నెల మొదటి వారంలో బిహార్​కు వెళ్లి ఓ కంట్రీ మేడ్​ గన్ కొన్నాడు. సిటీకి వచ్చి దేవేందర్ కదలికలను ప్రతిరోజు గమనించాడు. బుధవారం రాత్రి రతీశ్ బైక్​పై సందర్శిని హోటల్​కు వచ్చాడు. పార్కింగ్ ఏరియాలో దేవేందర్ కోసం వెయిట్ చేశాడు. హోటల్ సిబ్బంది తనను గుర్తుపడతారని భావించి మళ్లీ మెయిన్ రోడ్డుపైకి వెళ్లాడు.

రాత్రి 9.40 గంటలకు దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి బయలుదేరబోయాడు. అతడు హోటల్ లోపల నుంచి మెయిన్ రోడ్ పైకి రాగానే.. అక్కడే ఉన్న రతీశ్ గన్​తో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. 5 బుల్లెట్లు దేవేందర్ శరీరంలోకి దూసుకెళ్లగా, ఒక బుల్లెట్ నేలపై పడింది. వెంటనే రతీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ దేవేందర్​ను హోటల్ సిబ్బంది ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ అతడు మృతి చెందాడు.

మియాపూర్​ పోలీసులు క్లూస్​టీం, డాగ్​స్వ్కాడ్​తో ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం మాదాపూర్ డీసీపీ సందీప్ 6 స్పెషల్ టీమ్స్​ ఏర్పాటు చేశారు.కేరళకు పారిపోయేందుకు సిద్ధమైన రతీశ్​ను​ గురువారం ఉదయం మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.​ గన్​ను స్వాధీనం చేసుకున్నారు.