హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు..  ఇక నుంచి పల్లె దవాఖాన్లు

హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు..  ఇక నుంచి పల్లె దవాఖాన్లు
  • ప్రతి పల్లె దవాఖాన‌కు ఓ డాక్టర్‌‌ను నియమిస్తామని హెల్త్‌ డైరెక్టర్‌‌ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను ఇక నుంచి పల్లె దవాఖాన్లుగా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బస్తీ దవాఖాన్ల తరహాలోనే ఈ పల్లె దవాఖాన్లను తీర్చిదిద్దుతామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ శ్రీనివాసరావు తెలిపారు. దశలవారీగా మొత్తం 4,830 పల్లె దవాఖాన్లను అందుబాటులోకి తెస్తామని ‘వెలుగు’కు తెలిపారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో  కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్‌ (స్టాఫ్ నర్స్‌‌), ఏఎన్‌ఎం, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు. కానీ, పల్లె దవాఖాన్లలో ఎంబీబీఎస్‌ డాక్టర్లను కూడా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లకు అనుబంధంగా ఇవి నడుస్తాయన్నారు. బీపీ, షుగర్, కరోనా, మలేరియా, డెంగీ టెస్టులు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇతర టెస్టులు అవసరమైతే.. రోగి శాంపిల్స్ తీసుకుని జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్‌‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 
నిధులు కేంద్రానివే.. 
దేశవ్యాప్తంగా లక్షన్నర హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రెండేండ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. వీటి నిర్వహణ, మందులు, స్టాఫ్‌ వేతనాల వంటి అవసరాలకు నేషనల్ హెల్త్ మిషన్ కింద నిధులు సమాకూరుస్తామని ప్రకటించింది. మన రాష్ట్రానికి 4,830 సెంటర్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. డయేరియా, జ్వరం వంటి సీజనల్ రోగాలకు చికిత్స, బీపీ, షుగర్ చెకప్‌లు, గర్భిణులు, చిన్న పిల్లల హెల్త్ మానిటరింగ్‌, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాల అమలు, మందుల పంపిణీ వంటివన్నీ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల అందించాలని భావించింది. దీన్నే ఇంకాస్త అప్‌డేట్ చేసి, ఆయా సెంటర్లలో డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచాలని మన సర్కార్ నిర్ణయించింది.