
ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన తీరును వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 మంది వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ క్యాంపు మరణాలకు గల కారణాలపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఆపరేషన్ తర్వాత చనిపోయిన నలుగురికి ‘స్టెఫిలో కోకస్’ అనే ప్రమాదకర బ్యాక్టీరియా సోకినట్టు ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ రిపోర్ట్స్ ఇచ్చారు. సర్జరీల కోసం వాడే ఎక్విప్‌మెంట్, హాస్పిటల్ వాతావరణంలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. డీపీఎల్ సర్జరీల కోసం వాడిన ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్‌మెంట్ స్టెరిలైజ్ చేయకపోవడంతో ఈ బ్యాక్టీరియా సోకి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. చనిపోయిన నలుగురితో పాటు ఆ రోజు సర్జరీ చేయించుకున్న మరో 25 మంది కూడా స్టెఫిలో కోకస్ బారినపడినట్టు తెలిసింది.
వీళ్లలో కొంత మందికి కడుపులో ఇన్ఫెక్షన్ అయి ల్యాప్రోస్కోపిక్ హోల్, రింగ్స్ చుట్టూ చీము వచ్చింది. నిమ్స్, అపోలో డాక్టర్లు చీమును క్లీన్ చేసి, మహిళలను అబ్జర్వేషన్‌లో ఉంచారు. కొంత మందికి ఇన్ఫెక్షన్ స్థాయి తక్కువగా ఉండటంతో, వారికి యాంటి బయాటిక్స్‌తో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. హాస్పిటల్‌లో ఉన్న 30 మందిలో ఇద్దరు మాత్రమే పూర్తిగా కోలుకోగా, మిగిలిన వాళ్లంతా ఇప్పటికీ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గురువారం ఆరోగ్యశాఖ తెలిపింది.