బీమా డబ్బు రావడానికి.. 20–46 రోజులు

బీమా డబ్బు రావడానికి.. 20–46 రోజులు
  • కీమో థెరపీ కేసులకు మాత్రం త్వరగా చెల్లింపులు 
  • వెల్లడించిన సెక్యూర్​నౌ స్టడీ

న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా కంపెనీలు తమ కస్టమర్ల క్లెయిమ్‌‌లను పరిష్కరించడానికి 20–46 రోజులు తీసుకుంటున్నాయని ఇన్సూర్‌‌టెక్ ప్లాట్‌‌ఫారమ్ సెక్యూర్‌‌నౌ స్టడీ తెలిపింది. దీని ప్రకారం,  రోగులు ఆసుపత్రిలో చేరిన వారంలోపే సంబంధిత బీమా కంపెనీలకు క్లెయిమ్‌‌ల గురించి ఇన్సూరెన్స్‌‌కు కంపెనీకి తెలియజేస్తున్నారు. బీమా కంపెనీలు ప్రసూతికి సంబంధించిన క్లెయిమ్‌‌లను సెటిల్ చేయడానికి సగటున 7 నుంచి 108 రోజుల మధ్య సమయం తీసుకుంటాయి. సిజేరియన్‌‌లు క్లెయిములకు 9 రోజుల నుండి 135 రోజులు పడుతోంది. కీమోథెరపీ రోగుల ట్రీట్​మెంట్​ డబ్బును 12 నుండి 35 రోజుల్లోనే చెల్లిస్తున్నాయి. ఈ విషయమై సెక్యూర్‌‌నౌ సీనియర్​ ఎగ్జిక్యూటివ్ ​కపిల్​ మెహతా మాట్లాడుతూ, ‘‘ఆస్పత్రిలో చేరిన విషయాన్ని బీమా కంపెనీకి వివరాలు తెలియజేయడానికి రోగులు ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అయినప్పటికీ, బీమా కంపెనీ క్లెయిమ్‌‌లను సెటిల్ చేయడానికి  తీసుకుంటున్న సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ కేసుల్లో  పేషెంట్​ సమాచారం ఇచ్చిన తేదీ నుంచి  సెటిల్‌‌మెంట్ పూర్తి కావడానికి గరిష్టంగా 46 రోజుల వరకు పడుతోంది” అని వివరించారు. మనదేశంలో  ప్రతి సంవత్సరం దాదాపు కోటి ఆరోగ్య బీమా క్లెయిమ్‌‌లు ఉంటాయని చెప్పారు. హెల్త్​ ఇన్సూరెన్స్​ సెక్టార్​ వేగంగా ఎదుగుతోందని చెప్పడానికి ఈ అంకెలే రుజువని ఆయన అన్నారు.

26 శాతం మొత్తాన్ని ఇవ్వట్లే...
క్లెయిమ్ చేసినా,  అంటే రోగికి పెట్టిన మొత్తం డబ్బులో దాదాపు 13 నుండి 26 శాతం మొత్తాన్ని చెల్లించడం లేదు.  ‘‘ఇవి పాలసీ పరిధిలోకి రాని వస్తువులు లేదా పాలనాపరమైన ఖర్చులు” అని పేర్కొంటూ సెటిల్​మెంట్​ మొత్తం నుంచి తీసేస్తున్నారు.  ప్రసూతి,  కీమోథెరపీ కేసులకు రోజువారీ ఆసుపత్రి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డెంగ్యూ,  కరోనాతో సహా ఇతర వైరల్ ఇన్‌‌ఫెక్షన్ల బాధితులు 4 నుండి 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారు. జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టార్ అసోసియేషన్ (జీఐపీఎస్​ఏ) పరిధిలోని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు తక్కువ టారిఫ్​ వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుతున్నాయి. ఇది గ్రూప్​ హెల్త్​ ఇన్సూరెన్స్​కు క్లెయిమ్ ఖర్చులతోపాటు ప్రీమియాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల కంటే జీఐపీఎస్​ఏ రేట్లు ఉన్న ప్రభుత్వ రంగ బీమా కంపెనీల నుండి బీమా పాలసీలను తీసుకుంటే క్లెయిమ్ ఖర్చు  30 శాతం తక్కువగా ఉంటున్నది.