కరోనా పేషెంట్ 22న హైదరాబాద్‌కు.. 10 రోజుల తర్వాత నిన్న గాంధీ ఆస్పత్రికి

కరోనా పేషెంట్ 22న హైదరాబాద్‌కు.. 10 రోజుల తర్వాత నిన్న గాంధీ ఆస్పత్రికి

సికింద్రాబాద్ యువకుడికి కరోనా వైరస్
దుబాయ్‌లో వైరస్ బారిన పడిన టెకీ
అక్కడి నుంచి బెంగళూరుకు ఫ్లైట్‌లో
బెంగళూరు నుంచి బస్‌లో హైదరాబాద్‌
వారంపైగా తగ్గని జ్వరం.. నిన్న గాంధీ ఆస్పత్రికి
టెస్టుల్లో పాజిటివ్.. ఐసోలేషన్ వార్డులో చికిత్స
వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలు: ఈటల

కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హైదరాబాద్‌లో ఓ యువకుడికి కరోనా వైరస్ రావడంపై ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

సికింద్రాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరులో వర్క్ చేస్తూ.. గత నెలలో దుబాయ్ వెళ్లాడని, అక్కడ హాంకాంగ్‌కు చెందిన వారితో కలిసి పని చేశాడని తెలిపారు. అక్కడి నుంచి ఆ యువకుడు ఫిబ్రవరి 19న ఫ్లైట్‌లో బెంగళూరు వచ్చి.. కొద్ది రోజుల పాటు ఆఫీసులో డ్యూటీకి కూడా వెళ్లాడని చెప్పారు. అయితే గత నెల 22న బెంగళూరు నుంచి బస్‌లో హైదరాబాద్ వచ్చిన అతడికి జలుబు, జ్వరంగా ఉండడంతో స్థానికంగా వైద్య చేయించుకున్నాడని, తగ్గకపోవడంతో ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని మంత్రి ఈటల తెలిపారు. అతడికి వైద్యులు పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు తేలిందని, కన్ఫర్మేషన్ కోసం పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ యువకుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.

అందరికీ టెస్టులు చేస్తాం

కరోనా సోకిన యువకుడు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండడంతో పాటు బయటి క్లినిక్‌లో వైద్యం చేయించుకున్నాడని, ఇప్పటి వరకు అతడు కలిసిన ప్రతి ఒక్కరినీ పిలిపించి టెస్టులు చేయిస్తామని చెప్పారు ఆరోగ్య మంత్రి ఈటల. అతడితో పాటు బస్సులో వచ్చిన వారికి కూడా టెస్టులు చేసి క్వారంటైన్ చేస్తామన్నారు. ఇప్పటికే పలువురిని గుర్తించి టెస్టులు చేసినట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయం అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, నియంత్రణకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి. ఎవరికైనా జలుబు, ముక్కు కారడం, తలనొప్పి, జ్వరం లాంటివి ఉంటే వెంటనే డాక్టర్లను కలిసి టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఈ వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాపించే చాన్స్ లేదని స్పష్టం చేశారు మంత్రి. ఇప్పటి వరకు ఇండియాలో కానీ, రాష్ట్రంలోనే ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించిన కేసులు లేవని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వైరస్ సోకిందని, గతంలో కేరళలోనూ కరోనా పేషెంట్లకు చికిత్స ఇచ్చిన తర్వాత కోలుకున్నారని అన్నారు.