బాయిల్డ్ రైస్ కొనకుంటే... వడ్లు కొని పట్టియ్యండి

బాయిల్డ్ రైస్ కొనకుంటే... వడ్లు కొని పట్టియ్యండి

మెదక్, వెలుగు: ‘‘రైతులంటే లెక్క లేని పార్టీ బీజేపీ. రైతులపై కార్లెక్కించి చంపే పార్టీ బీజేపీ” అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘‘రైతులను పట్టపగలే నడిరోడ్డు మీద చంపిన కేంద్ర మంత్రిపై ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా బుక్​ కాలేదు. ఆయనను అరెస్టు ​చేయలేదు. పదవి నుంచి తొలగించలేదు. ఎన్ని దారుణాలు చేసినా బారా ఖూన్​ మాఫ్ అన్నట్టేనా మీ పార్టీల?’’ అని బీజేపీని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మెదక్‌‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ‘‘ఆయనకు రైతులంటే లెక్కలేనితనం. వాళ్ల సమస్యలేమిటో తెలియనితనం” అంటూ తూర్పారబట్టారు. అసలు బీజేపీ రైతులకు ఏం మేలు చేసిందని ఆ పార్టీ లీడర్లు రైతుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోడీ సర్కారు పొటాష్​, డీఏపీ, డీజిల్​ధరలు పెంచి పెద్ద భారం మోపిందన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్​ కొనం పొమ్మంటున్నది. రైతులపై టెర్రరిస్టు ముద్ర వేస్తున్నది” అని హరీశ్ దుయ్యబట్టారు.

ఏ ఊరికన్నా రా.. రైతుల సమస్యలేందో తెలుస్తయి
రైతులకు ఏ సమస్యలూ లేవని కిషన్​ రెడ్డి అంటున్నారని హరీశ్ ఆరోపించారు. యాసంగిలో వరి వద్దని ఢిల్లీ బీజేపీ లీడర్లు, వేయాలని గల్లీ బీజేపీ లీడర్లు లక్షలాది రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైరయ్యారు. ‘‘యాసంగిలో బాయిల్డ్ రైస్ ​కొనేది లేదని కేంద్రం అనుడుతో ఏ పంట వేయాన్నా అని రైతులు ఆందోళన చెందుతున్నరు. తీరా పండించినంక కొనం పొమ్మంటె? రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితొస్తది. అట్ల కాకుండా చూడాలనే మా తండ్లాట. తెలంగాణల ఎండలెక్కువ. కనుక యాసంగి వడ్లు మరాడిస్తే నూకల శాతం ఎక్కువుంటది. అందుకనే ఇన్నేండ్ల నుంచి కేంద్రంల ఎవలున్నా యాసంగిలో బాయిల్డ్​రైస్ కొంటా వచ్చిన్రు. ఇప్పుడెందుకు కొనరు?’’ అని ప్రశ్నించారు. కొనకపోతే కేంద్రమే ధాన్యం కొని బియ్యం పట్టియ్యాలని డిమాండ్ చేశారు. ‘‘పోయిన యాసంగిల కొన్న 70 శాతం బాయిల్డ్ రైస్​ఇంకా గోదాముల్లనే మూలుగుతున్నది. నిల్వకు సౌలతుల్లేక ధాన్యం కొనుగోళ్లు లేటైతున్నై. కిషన్​రెడ్డికి రైతుల మీద ప్రేముంటే రైల్వే ర్యాక్ పాయింట్లు పెట్టిచ్చి బాయిల్డ్ రైస్​స్టాకును తక్షణం షిఫ్ట్​చేయించాలె” అని డిమాండ్ చేశారు.