
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ రిమాండ్ ఆర్డర్ పై విచారణ చేపట్టిన కోర్టుకు.. ఆల్రెడీ ఆయన బెయిల్ మీద బయటికి వచ్చారని అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. బండి సంజయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఆయన తన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. విచారణకు సహకరించనందుకు గానూ బండి సంజయ్ బెయిల్ రద్దు చేయండంటూ ఏజీ కోరారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ బెయిల్ రద్దుపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ మీద విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది (AG) వాదించడతో.. రిమాండ్ ఇల్లీగల్ మీద వాదనలు వినిపిస్తామని బండి సంజయ్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఫోన్ ఇవ్వకపోవడం, పోలీసులకు సహకరించడం లేదన్న విషయాలను అఫిడవిట్ లో దాఖలు చేసి రికార్డ్ లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది.