దానం అనర్హత పిటిషన్ పై ముగిసిన విచారణ

దానం అనర్హత పిటిషన్ పై  ముగిసిన విచారణ
  •     ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేసిన దానం తరపు అడ్వకేట్లు

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ విచారణ ముగిసింది. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో దానంపై అనర్హత పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో దానం తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. 

దానంపై అనర్హత పిటిషన్ వేయడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటని ఆ ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్టు తెల్సింది. కేవలం మీడియాలో వచ్చిన వార్తలు, క్లిప్పింగ్ లు,  వీడియోల ఆధారంగా ఆయన పార్టీ మారినట్టు అనర్హత పిటిషన్ వేశారని.. ఇవి ఏ మేరకు బలమైన ఆధారాలు అని కౌశిక్ రెడ్డిని, మహేశ్వర్ రెడ్డిని వారు ప్రశ్నించినట్లు సమాచారం. 

దానంను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు ఆయనపై ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని, ఈ విషయం మీకు తెలుసా.. అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దానంపై అనర్హత పిటిషన్లు ఎలా వేశారని, అవి ఎంత వరకు నిలుస్తాయని వారిని ప్రశ్నించారు. కాగా, దానంపై అనర్హత పిటిషన్ వేయడానికి తమ వద్ద ఉన్న ఆధారాలను స్పీకర్ సమక్షంలో దానం తరఫు అడ్వకేట్లకు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి అందజేసినట్టు తెల్సింది. ఇక త్వరలోనే దానంను కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తరఫు అడ్వకేట్లు ప్రశ్నించనున్నారు.

అన్ని ఆధారాలు స్పీకర్​కు ​ఇచ్చా: కౌశిక్ రెడ్డి 

దానంపై అనర్హత వేటు వేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశానని కౌశిక్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా దానం పోటీ చేశారని.. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలన్నారు. దానంపై స్పీకర్ అనర్హత వేటు వేస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. అసెంబ్లీ బయట మాట్లాడకుండా తెలంగాణ అసెంబ్లీ అని ఉన్న బోర్డును కూడా తొలగించారని కౌశిక్​రెడ్డి ఆరోపించారు. 

అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు: మహేశ్వర్ రెడ్డి

దానం తరఫు అడ్వకేట్లు పలు ప్రశ్నలతో తనను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దానంను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్  చేసినట్టుగా సుప్రీంకోర్టులో ఆ పార్టీ అఫిడవిట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా.. అంటూ దానం తరఫు అడ్వకేట్లు తనను అడిగారని.. అదే నిజమైతే ఇక దానంపై అనర్హత కేసు ఎలా నిలుస్తుందని అనమానం వ్యక్తం చేశారు. ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని బీఆర్ఎస్ ను ఆయన ప్రశ్నించారు. 

నేడు కడియం అనర్హత పిటిషన్​పై ఎమ్మెల్యే వివేకానంద విచారణ

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను విచారణకు హాజరుకావాలని బుధవారం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలోజరగనున్న విచారణకు వివేకానంద హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను అందించనున్నారు.