లిక్కర్ స్కామ్‌‌లో కవిత పిటిషన్‌‌పై 28న విచారణ

లిక్కర్ స్కామ్‌‌లో కవిత పిటిషన్‌‌పై 28న విచారణ

 న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు (అరెస్ట్ లాంటివి) తీసుకోకుండా చూడాలంటూ ఆమె వేసిన పిటిషన్‌‌పై విచారణను ఈ నెల 28న విచారిస్తామని వెల్లడించింది. గతంలో ఈ పిటిషన్‌‌ను విచారించిన కోర్టు.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్‌‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. 

మరోసారి ఈ పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు బెంచ్​ విచారణ జరిపింది. అందరి సమస్య ఒక్కటేనని, ఈ పిటిషన్లను కలిపి విచారించాలని కవిత తరఫు అడ్వకేట్ కపిల్‌‌ సిబల్‌‌ కోరగా, అన్ని పిటిషన్లు దేనికి అవే వేరని, ఒకే అంశానికి సంబంధించినవి ఎలా అవుతాయని ప్రశ్నించింది. పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని పేర్కొంది.